ఆ భయంతోనే తిరుగుబాటు?

నవంబరులో ఎన్నికలు జరిగిన నాటి నుంచీ సైన్యం, దాని అనుంగు రాజకీయ వర్గాల కదలికలు అనుమానాస్పదంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. గతవారమే అనేక విదేశీ రాయబార కార్యాలయాలు ఈ తిరుగుబాటుపై అనుమానాలు ..

Updated : 03 Feb 2021 11:13 IST

ప్రజాస్వామ్యం క్రమంగా గాడిన పడుతోందనుకుంటున్న దశలో మయన్మార్‌లో మళ్లీ సైన్యం ఎందుకని ఉన్నట్టుండి తల పైకెత్తింది? తమకు మద్దతిచ్చినా ఎందుకని సూకీపై కొరడా ఝళిపించింది? అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధిస్తుందని  తెలిసి కూడా ఎందుకని తిరుగుబాటుకు ధైర్యం చేసింది? తిరుగుబాటును ఎవరూ ముందే గుర్తించలేదా?  ఈ ప్రశ్నలకు సమాధానం గత కొద్దిరోజులుగా మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలిసిపోతుంది. 

నవంబరులో ఎన్నికలు జరిగిన నాటి నుంచీ సైన్యం, దాని అనుంగు రాజకీయ వర్గాల కదలికలు అనుమానాస్పదంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. గతవారమే అనేక విదేశీ రాయబార కార్యాలయాలు ఈ తిరుగుబాటుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. కానీ వాటన్నింటినీ మయన్మార్‌ సైన్యం తోసిపుచ్చింది. తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారని, అనవసరంగా తమను అనుమానిస్తున్నారని ఖండించింది. కానీ కొద్దిరోజుల కిందట జరిగిన సమావేశంలో తిరుగుబాటు అనుమానాలపై మీడియా ప్రశ్నించగా... సైన్యం ప్రతినిధి ఆ అవకాశాలను తోసిపుచ్చకపోవటం గమనార్హం.
సూకీ.. సైన్యంతో స్నేహంగానే.. 
ప్రస్తుత మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో ఉన్నా, సైన్యానికి విశేషాధికారాలున్నాయి. అందుకే- సైనిక నిర్బంధం నుంచి విడుదలై అధికారం చేపట్టిన ఆంగ్‌ సాన్‌ సూకీ... ఆది నుంచీ సైన్యంతో స్నేహపూరితంగానే వ్యవహరిస్తూ వచ్చారు. రోహింగ్యాలపై మయన్మార్‌ సైనిక దాడులను అంతర్జాతీయ సమాజం ఖండిస్తే... సూకీ మాత్రం వారిని వెనకేసుకొచ్చారు. అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠకు మచ్చ వస్తున్నా సూకీ సైన్యంతో స్నేహంగానే మెలిగారు. ఇతరత్రా కూడా వారిపై ఎన్నడూ విమర్శలు గుప్పించలేదు. 

ఎన్నికల్లో పరాభవం 
ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) హౌస్‌ ఆఫ్‌ నేషనాలిటీస్‌లో 138 సీట్లు సాధించింది. ప్రతినిధుల సభలో 258 సీట్లు గెల్చుకుంది. సైన్యం మద్దతున్న యూనియన్‌ సాలిడారిటీ డెవలప్‌మెంట్‌ పార్టీ (యూఎస్‌డీపీ) దారుణంగా ఓడిపోయింది. రెండు సభల్లో వరుసగా కేవలం 7, 26 సీట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది. అప్పట్నుంచి రాజ్యాంగ సవరణలపై సూకీ బృందం ఆలోచించటం మొదలెట్టింది. ఈ చర్యలను సైన్యం వ్యతిరేకిస్తూ వస్తోంది. కొత్త పార్లమెంటు సమావేశమై నిర్ణయాలు తీసుకోకుండా తిరుగుబాటు ద్వారా సూకీకి, రాజ్యాంగ సవరణలకు సైన్యం కళ్లెం వేసింది.

అధ్యక్ష పీఠంపై లయాంగ్‌ కన్ను 
దీనికి తోడు... సైనికాధినేత మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌- చాలాకాలంగా దేశ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. దీనికి పార్లమెంటులో మెజార్టీ సభ్యుల ఆమోదం కావాలి. మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం... పార్లమెంటులో 25 శాతం సీట్లు మిలిటరీ చేతిలో ఉంటాయి. రాజ్యాంగాన్ని తమ ఆమోదం లేకుండా సవరించుకోకుండా ఉండేలా ఈ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో తమ కనుసన్నల్లో నడిచే యూఎస్‌డీపీ సీట్ల సంఖ్య దారుణంగా పడిపోవటంతో... స్వయంగా 25 శాతం సీట్లున్నా కూడా సైన్యం తన మాట చెల్లించుకోలేకపోవచ్చు. అంటే... సైనికాధినేత లయాంగ్‌ అధ్యక్షుడయ్యే అవకాశాలు తక్కువ. రాజ్యాంగబద్ధంగా ఆ పదవి దక్కే పరిస్థితులు లేకపోవటంతో పాత పద్ధతిలో సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధం చేశారు. అంతర్జాతీయంగా అన్ని దేశాలూ కరోనాతో పోరాటంలో మునిగితేలుతుండటం, అమెరికా తన అంతర్గత గొడవల్లో ఉండటం మయన్మార్‌ సైన్యానికి కలసి వచ్చాయి.

విచారణ తప్పించుకునేందుకే..? 
లయాంగ్‌ అధ్యక్ష పీఠాన్ని ఆశించడానికి కూడా బలమైన కారణాలు లేకపోలేదు. ఈ ఏడాది జులైలో ఆయనకు 65 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు పదవీ విరమణ చేయాల్సి ఉంది. మామూలుగానైతే ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం ఏమీ కాదు. కానీ... రిటైర్మెంట్‌తో లయాంగ్‌కు కష్టాలు ఆరంభమయ్యే అవకాశం ఉంది. రోహింగ్యాలపై ఆయన సారథ్యంలోనే మారణకాండ జరిగిందనేది అంతర్జాతీయంగా ఉన్న ఆరోపణ.  రిటైరైన తక్షణమే ఆయనపై అంతర్జాతీయంగా విచారణకు దారులు తెరుచుకుంటాయి. అప్పుడు సూకీ మద్దతిస్తారో లేదో తెలియదు. పదవిలో ఉంటే ఈ విచారణలన్నింటి నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే లయాంగ్‌ సైనిక తిరుగుబాటుకు ఆదేశించారన్నది విశ్లేషకుల వాదన.  

- ఈనాడు ప్రత్యేక విభాగం 

 

ఇవీ చదవండి..
ఎంపీలకు నిద్ర లేని రాత్రి

మయన్మార్‌ వెనక్కి తగ్గకుంటే ఆంక్షలు: బైడెన్‌ 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని