‘మయన్మార్‌లో హింసపై చర్యలు తీసుకోండి’

మయన్మార్‌లో సైనిక పాలన ముగింపునకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని ఐరాసలో ఆ దేశ రాయబారి క్యామోయి టున్‌ వెల్లడించారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టి హింసను తగ్గించాలని ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో  శుక్రవారం  భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. 

Updated : 27 Feb 2021 12:39 IST

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక పాలన ముగింపునకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని ఐరాసలో ఆ దేశ రాయబారి క్యామోయి టున్‌ వెల్లడించారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టి హింసను తగ్గించాలని ఐరాస సర్వప్రతినిధి సభా సమావేశంలో శుక్రవారం భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు.

‘మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య పాలన కోరుతూ నిరసనలు చేస్తున్న వారిపై కొనసాగుతున్న హింసకు ముగింపు పలకాలి. తిరిగి ప్రజాస్వామ్య పాలనను నెలకొల్పాలి’ అని క్యామోయి కోరారు. ఈ సందర్భంగా క్యామోయి తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారికి మద్దతుగా మూడు వేళ్ల చిహ్నంతో సెల్యూట్‌ చేశారు. దీంతో ఛాంబర్‌లో ఉన్న వారంతా ఆయన్ను అభినందించారు.

ఈ సందర్భంగా ఐరాసలో యూఎస్‌ రాయబారి లిండా థామస్‌ మాట్లాడుతూ.. ‘మిలిటరీ చర్యలపై తదుపరి పరిణామాల్ని మేం చూపిస్తాం’ అని పేర్కొన్నారు. మయన్మార్‌లో కొనసాగుతున్న పరిణామాల్ని భారత్‌ నిశితంగా గమనిస్తోందని ఐరాసకు భారత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు. శాంతియుత విధానంలో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనాలని ఆయన అక్కడి పాలకులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ క్లిష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం ఆ దేశానికి తమ మద్దతును అందజేయాలని కోరుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించి.. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. 

మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌ సూకీని ఫిబ్రవరి 1న సైన్యం నిర్బంధించి పాలనను తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పాలని డిమాండు చేస్తూ ప్రజల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. మాండలే నగరంలో గతవారం నిరసనలు చేస్తున్న వారిపై సైన్యం కాల్పులు జరపగా.. నలుగురు మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. దీంతో అక్కడ సైన్యం హింసను ఆపాలని యూఎస్‌ సహా పలు ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని