మయన్మార్‌: అడ్డొస్తే 20 ఏళ్ల జైలే!

సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారికి కఠిన శిక్షలు

Published : 15 Feb 2021 20:10 IST

నయ్‌పైటా: పదవీచ్యుతురాలైన మయన్మార్‌ ప్రజాస్వామ్య నేత ఆంగ్‌ సాన్‌ సూకిపై న్యాయవిచారణ వాయిదా పడింది. ఆమెను సోమవారం న్యాయస్థానంలో హాజరు పర్చాల్సి ఉండగా.. దీనిని ఫిబ్రవరి 17కు వాయిదా వేసినట్టు సూకీ తరపు న్యాయవాది ఖిన్‌ మౌంగ్‌ జా తెలిపారు. ఈ నేపథ్యంలో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారికి కఠిన శిక్షలు విధిస్తామంటూ మయన్మార్‌లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ దేశంలో ఇంటర్నెట్‌ తిరిగి అందుబాటులోకి వచ్చిన కొద్దిసేపటికే.. మిలిటరీ వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. సైనిక బలగాలను అడ్డగించిన వారు అత్యధికంగా ఇరవై ఏళ్ల జైలు జీవితం గడపాలని దీనిలో ప్రకటించింది. సూకి విచారణ సందర్భంగా నిరసనలు తారా స్థాయికి చేరే అవకాశముండటంతో.. సైన్యం ఈ చర్యలు చేపట్టిందని పరిశీలకులు అంటున్నారు.

ఫిబ్రవరి 1న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటి నుంచీ.. ఆంగ్‌ సాన్‌ సూకితో సహా తమ నేతలను విడుదల చేయాలంటూ ప్రజా ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. సూకిని బుధవారం రాజధాని నయ్‌పైటాలో వీడియో సమావేశం విధానంలో విచారిస్తారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌లో నిఘాను తీవ్రం చేశారు. ఇక్కడి పలు నగరాల్లో సైనిక వాహనాలు గస్తీ తిరుగుతున్నాయి. కాగా, ఆరునెలలు జైల్లో పెడతామన్నా ప్రజలు ఏమాత్రం వెన్ను చూపకపోవటంతో.. మిలిటరీ ప్రభుత్వం శిక్షలను మరింత కఠినం చేసింది. మాటలు, చేతలు, వ్రాతపూర్వకంగా, సంజ్ఞలు లేదా మరే ఇతర విధానంలోనైనా నిరసన తెలియచేయటం శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకత, ధిక్కారాలకు భారీ జరిమానాలు, సుదీర్ఘకాల శిక్షలుంటాయని సైన్యం హెచ్చరించింది. సైనిక విధుల నిర్వహణకు అడ్డు వచ్చిన వారికి ఏడేళ్ల జైలు, ప్రజల్లో అసహనాన్ని ప్రోత్సహించిన వారికి మూడేళ్ల శిక్షలుగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని