మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు

మయన్మార్​ కీలకనేత ఆంగ్​సాన్​సూకీని ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. సూకీ సహా అధికార నేషనల్ లీగ్ ఫర్​డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ ఛైర్మన్‌ను సోమవారం ఉదయం సైన్యం అదుపులోకి తీసుకునట్లు మయన్మార్​ మీడియా తెలిపింది......

Published : 01 Feb 2021 09:51 IST

నేపిడా: మయన్మార్​ కీలకనేత ఆంగ్ ​సాన్​ సూకీని ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. సూకీ సహా అధికార నేషనల్ లీగ్ ఫర్ ​డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ ఛైర్మన్‌ను సోమవారం ఉదయం సైన్యం అదుపులోకి తీసుకునట్లు మయన్మార్​ మీడియా తెలిపింది. రాజధాని నేపిడాలో టెలిఫోన్​, ఇంటర్నెట్​ సేవలు నిలిపివేశారని పేర్కొంది. ఎన్ఎల్‌డీ పార్టీ నాయకులెవరూ ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదని తెలిపింది. 

అనంతరం మయన్మార్ ఇప్పుడు పూర్తిగా తమ నియంత్రణలో ఉందని సైన్యం ప్రకటించింది. ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని ఆర్మీ వెల్లడించింది. గతేడాది జరిగిన ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు మయన్మార్​ చట్టసభ్యులు సోమవారం నేపిడాలో సమావేశం కావాల్సి ఉంది. 

ఈ ఎన్నికలు అక్రమంగా జరిగాయని సైనిక తిరుగుబాటు తప్పదని సైనికాధికారులు కొద్ది రోజుల క్రితమే హెచ్చరించారు. నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ 476 స్థానాలకు గానూ.. 396 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. దశాబ్దాల సైనిక పాలన నుంచి విముక్తి కల్పిస్తూ 2015లో తొలిసారి సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

అమెరికా హెచ్చరిక...

మయన్మార్‌లో పరిస్థితులకు నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ప్రజాస్వామ్య పరివర్తనను అణగదొక్కడానికి మయన్మార్ ​సైన్యం ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రకటనలో పేర్కొంది. నిర్బంధంలో ఉంచిన సూకీ, ఇతర నాయకులను విడుదల చేయాలని సైన్యానికి సూచించింది. ప్రజాస్వామ్య సంస్థలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

ఇవీ చదవండి...

ఎదురుచూపులు మాకు అలవాటే

చర్చల వాతావరణం కల్పించాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని