
Myanmar: శరణార్థిగా ముఖ్యమంత్రి..
గువాహటి: మయన్మార్‌లో సైనిక పాలకుల దాష్టీకంతో అక్కడి లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పారిపోతున్నారు. భారత్‌లోనూ అనేక మంది ఆశ్రయం పొందారు. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దేశానికి శరణార్థిగా వచ్చినట్లు తెలిసింది. మయన్మార్‌లోని చిన్ రాష్ట్ర సీఎం సలై లియాన్ లుయాయ్ మిజోరంలో ఓ శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. లుయాయ్.. సోమవారం రాత్రి చంపాయ్లోని సరిహద్దును దాటి మిజోరంకు వచ్చినట్లు పేర్కొన్నాయి.
పశ్చిమ మయన్మార్‌లో ఉండే చిన్ రాష్ట్రానికి మిజోరంలోని ఆరు జిల్లాలతో సరిహద్దు ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత ఆ దేశం నుంచి వేలాది మంది భారత్‌కు వలసవచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మిజోరంలో 9,247 మంది మయన్మార్ వాసులు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో చట్టసభ్యులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు.
చాలా మందికి స్థానికులే ఆశ్రయం కల్పిస్తుండగా.. కొన్ని ఎన్జీవోలు, యూత్ ఆర్గనైజేషన్లు కూడా శరణార్థుల కోసం శిబిరాలు ఏర్పాటు చేశాయి. అటు ప్రభుత్వం కూడా వీరికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తమ రాష్ట్రంలో ఆశ్రయం కోసం వచ్చిన వారికి సాయం చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా నిన్న వెల్లడించారు. మరో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ చాలా మంది ఆశ్రయం పొందుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన అక్కడి సైన్యం పాలనాధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సైన్యం పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో వారిపై సైనికులు దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో అనేక మంది ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సైన్యం ఆగడాలను భరించలేని మయన్మార్ వాసులు పొరుగుదేశాలకు వలస వెళ్లి తలదాచుకుంటున్నారు. అలా భారత్‌తో పాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌కు చాలా మంది వెళ్లిపోతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.