Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి

పాకిస్థాన్‌లో ఓ అంతుచిక్కని వ్యాధికి 18 మంది బలయ్యారు. అందులో 14 మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Published : 27 Jan 2023 21:58 IST

కరాచీ: ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు అధిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా మారుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్‌ పోర్ట్‌ సిటీగా పేరుగాంచిన కరాచీకి సమీపంలోని కెమరీ ప్రాంతంలో చిన్నారుల మరణం కలకలం రేపింది. ఓ అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు.

జనవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య కాలంలో కెమరీ ప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో 18 మంది మృత్యువాతపడ్డారు. అందులో 14 మంది చిన్నారులే ఉన్నారని డైరెక్టర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అబ్దుల్‌ హమీద్‌ జుమానీ ధ్రువీకరించారు. మరణాలకు కారణాలు తెలియనప్పటికీ.. తీర ప్రాంతం సమీపంలో ఉండడంతో సముద్రం లేదా నీటికి సంబంధించి ఏదైనా సమస్యతో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు.

చనిపోయే ముందు బాధితులు తీవ్ర జ్వరం, గొంతు దగ్గర వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొన్నారని వైద్యాధికారులు వెల్లడించారు. అయితే, ఆ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వింత వాసన వస్తుందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి పరిశ్రమల నుంచి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని