
Nagaland: ఆ కమాండోలను శిక్షించాలి.. ‘ప్రత్యేక అధికారాల’ చట్టాన్ని రద్దు చేయాలి
నాగాలాండ్ ఘటన బాధిత కుటుంబాల డిమాండ్
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో వారం కిందట తిరుగుబాటుదారులుగా పొరబడి.. సాధారణ పౌరులపై భద్రత బలగాలు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతోపాటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో మొత్తం 14 మంది పౌరులు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. దీనిపై పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన కూడా చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల పరిహారం ప్రకటించింది.
అయితే, తమకు న్యాయం జరిగే వరకూ పరిహారం తీసుకోబోమని ఓటింగ్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలు స్పష్టం చేశాయి. మృతి చెందిన 14 మంది పౌరుల్లో 12 మంది ఓటింగ్ గ్రామస్థులే. దీంతో అక్కడి ప్రజలంతా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా వారికి ప్రభుత్వం తరఫున పరిహారంలో కొంత మొత్తం అడ్వాన్సుగా అందింది. అయితే, దాన్ని తీసుకోవద్దని బాధిత కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. కాల్పులకు పాల్పడ్డ భారత బలగాల్లోని 21వ పారా కమాండోలను న్యాయపరంగా శిక్షించాలని కోరుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పరిహారం తీసుకోబోమని వెల్లడించారు. అంతేకాదు, ఈశాన్య రాష్ట్రాల్లోని బలగాలకు ‘ప్రత్యేక అధికారాల’ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
► Read latest National - International News and Telugu News