Mukhtar Abbas Naqvi: కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం?

భాజపాలో కీలక మైనార్టీ నేత, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా

Published : 06 Jul 2022 17:25 IST

దిల్లీ: భాజపాలో కీలక మైనార్టీ నేత, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి పదవులు రాజీనామా చేశారు.

అయితే నఖ్వీ రాజీనామాపై అనేక ఊహాగానాలను వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం నఖ్వీ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో మైనార్టీ వర్గంలో కాషాయ పార్టీపై కొంత వ్యతిరేకత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో నఖ్వీని ఉపరాష్ట్రపతి పదవికి బరిలో దించాలని ఎన్డీయేలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి రేసులో పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నఖ్వీ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూను ఎన్డీయే ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉపరాష్ట్రపతిగా ఎవరిని నిలబెట్టనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని