
Narayan Rane: కేంద్రమంత్రి నారాయణ రాణే అరెస్టు సరైందే.. కానీ
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్ రాణె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ కేసులో పోలీసులు అయనను అరెస్టు చేయగా.. కొద్ది గంటల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనను అరెస్టు చేయడం సమర్థనీయమే అని బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
గత సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ్ రాణె.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి స్వాతంత్య్రం ఏ ఏడాది వచ్చిందో గుర్తులేక వెనుకనున్నవారిని అడిగి తెలుసుకున్నారనీ, తాను గానీ అక్కడ అప్పుడు ఉంటే ఆయన్ని చాచి లెంపకాయ కొట్టేవాడినని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ శివసేన నాయకులు కేంద్రమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం అర్ధరాత్రి తర్వాత రాయ్‌గఢ్‌లోని మహాద్ మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రిని హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేంద్రమంత్రిని వారం రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఎస్ఎస్ పాటిల్ తీర్పు వెలువరిస్తూ.. ‘‘కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే ఆయన అరెస్టు సమర్థనీయమే. అయితే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదు. ఈ కేసులో నిందితుడిని(రాణె) బెయిల్‌పై విడుదల చేస్తే విచారణకు ఎలాంటి ఆటంకం ఉండదు. నిందితుడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడు’’ అని తెలిపారు. రూ. 15వేల పూచికత్తు మీద ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. విచారణ నిమిత్తం ఆగస్టు 31, సెప్టెంబరు 13న పోలీసుల ఎదుట హాజరుకావాలని కేంద్రమంత్రిని ఆదేశించింది.