Narendra Giri: ‘తలకు గాయాలున్నాయి.. సూసైడ్‌ నోట్‌ ఆయన రాయలేదు’

నరేంద్రగిరి మృతిపై నిరంజని అఖాడా అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి తాజాగా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.....

Published : 22 Sep 2021 21:13 IST

ప్రయాగ్‌రాజ్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శిష్యుడు ఆనంద్‌ గిరితోపాటు మరికొందరు బ్లాక్‌మెయిల్‌ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్లడించారు. కాగా నరేంద్రగిరి మృతిపై నిరంజని అఖాడా అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి తాజాగా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని.. తలకు గాయాలున్నట్లు పేర్కొన్నారు. నరేంద్రగిరి గదిలో లభించిన సూసైడ్‌ నోట్‌ కూడా ఆయన రాయలేదని ఆరోపించారు.

రవీంద్ర పూరి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే అతడి తలకు గాయాలు ఎలా ఉంటాయి? ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల నాలుక బయటకు వస్తుంది. కానీ నరేంద్రగిరి విషయంలో అలా లేదు. సూసైడ్‌ నోట్‌ ఆయన రాసినట్లు లేదు. డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి రాసినట్లు ఉంది’ అని పేర్కొన్నారు. నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వ్యక్తి కాదని తెలిపారు.

నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అతిథి గృహంలో ఓ సూసైడ్‌ నోట్‌ లభించిందని.. అందులో మహంత్‌ పలు విషయాలను ప్రస్తావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. శిష్యుడు ఆనంద్‌గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యారని, తప్పుడు ఆధారాలు సృష్టించి తనను బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు నోట్‌లో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆనంద్‌గిరితోపాటు ఆధ్య తివారి, అతడి కుమారుడు సందీప్‌ తివారి కూడా తన ఆత్మహత్యకు కారణమని ఆ నోట్‌లో వెల్లడించారు.

ఈ కేసులో ఆనంద్‌గిరితోపాటు ఆధ్య తివారిని ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని