Rahul Gandhi: వారణాసిలో మోదీ ఓటమి నుంచి తప్పించుకున్నారు: రాహుల్‌ గాంధీ

కేరళలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.   

Updated : 12 Jun 2024 19:17 IST

తిరువనంతపురం: ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పోటీ చేసిన వారణాసిలో ఆయన ఓటమి నుంచి తప్పించుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పేర్కొన్నారు. కేరళలోని మలప్పురంలో ఓ సమావేశంలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అయోధ్య ప్రజల చేతిలో భాజపా ఓడినట్లే వారణాసిలో మోదీ ఓడిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావాల్సిన సీట్లు భాజపా ఒంటరిగా సాధించకపోవడానికి మోదీ నైతిక బాధ్యత వహించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

ఎన్నికలకు ముందు రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు మాట్లాడారని, కానీ అదే రాజ్యాంగానికి ప్రమాణస్వీకారం వేళ మోదీ దండం పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు వారికి ఏం కావాలో ప్రధానికి స్పష్టంగా తెలిసేలా చేశారన్నారు. 

మోదీ వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌(Ajay Rai)పై 1,50,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అయోధ్యలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన అవదేశ్ ప్రసాద్ భాజపా(BJP) అభ్యర్థి లల్లూ సింగ్‌పై విజయం సాధించారు. భాజపా కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లో ఆరు స్థానాలతో సహా మొత్తం 99 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 240 సీట్లలో విజయం సాధించినా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి మరో 32 సీట్లు కావాల్సి రావడంతో చంద్రబాబునాయుడు(టీడీపీ), నీతీశ్‌కుమార్ (జేడీయూ) సహాయం తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు