Modi: కరోనా విపత్తు వేళ యోగా ఆశా కిరణం

యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 21 Jun 2021 10:31 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగం

దిల్లీ : యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగించారు.

‘కరోనాతో భారత్‌ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్యం సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది’ అని ప్రధాని వెల్లడించారు.

క్లిష్ట సమయంలో విశ్వాసం పాదుకొల్పిన సాధనం..

‘కంటికి కనిపించని కరోనా వైరస్‌ ప్రపంచంపై దాడి చేసినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క దేశం వద్ద సరైన వసతులు లేవు. మానసికంగా దానితో పోరడడానికి సిద్ధంగా లేం. అలాంటి కష్ట సమయంలో ఆత్మ విశ్వాసం పెంపొందించే సాధనంగా యోగా మారింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు యోగాను ఓ సురక్షా కవచంగా మార్చుకున్నట్లు నాతో తెలిపారు. వారిని వారు రక్షించుకోవడంతో పాటు కరోనా బాధితుల్ని కాపాడడానికి కూడా యోగాను ఉపయోగించుకున్నారు. బాధితులకు వైద్యులు యోగా సాధన చేయిస్తున్న చిత్రాలు ఉన్నాయి. మహమ్మారి మూలంగా ఇన్నాళ్లు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న స్ఫూర్తి మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించిన ‘యోగా ఫర్‌ వెల్‌నెస్‌’ వల్ల ప్రజలు యోగాను మరింత విస్తృతంగా సాధన చేస్తారని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ అన్నారు.

ప్రతికూల ఆలోచనల నుంచి ఆవిష్కరణల వైపు..

‘ప్రతికూల ఆలోచనల నుంచి ఆవిష్కరణల వైపు మళ్లించే శక్తి యోగాకు ఉంది. మనలో ఇమిడి ఉన్న శక్తిని వెలికితీయడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడి శక్తిమంతంగా మారేందుకు బాటలు వేస్తుంది. వైద్యశాస్త్రం సైతం చికిత్సతో పాటు స్వస్థత  ప్రక్రియలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. యోగాకు స్వస్థత చేకూర్చే శక్తి ఉంది. మన శరీరంపై యోగా ప్రభావాన్ని ఆవిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి’ అని ప్రధాని వివరించారు.

ఎమ్‌-యోగా యాప్‌..

యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగా సే సహయోగ్‌ తక్‌’ అన్న మంత్రాన్ని ప్రజలకు అందించిన ప్రధాని మోదీ ఎమ్‌-యోగా అనే మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. దీంతో యోగా శిక్షణకు సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయన్నారు. వివిధ భాషల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ యాప్ దోహదం చేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని