Perseverance Rover: అంగారకుడి మట్టి.. భూమి మీదకు!

అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర లిఖించడానికి నాసా సిద్ధమైంది. అంగారకుడిపై జీవం ఉనికిని తెలుసుకునేందుకు తొలిసారి ఆ గ్రహంపై మట్టి నమూనాలను సేకరించనుంది....

Published : 25 Jul 2021 01:28 IST

వాషింగ్టన్‌: అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర లిఖించడానికి నాసా సిద్ధమైంది. అంగారకుడిపై జీవం ఉనికిని తెలుసుకునేందుకు తొలిసారి ఆ గ్రహంపై మట్టి నమూనాలను సేకరించనుంది. అత్యంత క్లిష్టమైన ఈ సాంకేతిక ప్రక్రియను అంగారకుడిపై పంపిన పర్సెవరెన్స్ రోవర్ ఆగస్టు మొదటి వారంలో చేపట్టన్నట్లు నాసా ప్రకటించింది.

అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా? లేదా? అనేది నిర్ధరించేందుకు అమెరికా పంపించిన పర్సెవరెన్స్‌ రోవర్‌ తన పని మొదలుపెట్టింది. వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టి నమూనాల తర్వాత మళ్లీ అంగారకుడిపై మట్టి నమూనాలను భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు మొదటివారంలో అంగారకుడి రాతిపై డ్రిల్లింగ్‌ నిర్వహించి నమూనాలను సేకరించనున్నట్లు నాసా సైన్స్‌ అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌ థామస్‌ జుర్బుచన్‌ తెలిపారు.

ఫిబ్రవరి 18న అరుణగ్రహంపై జైచిరో అగ్నిపర్వతానికి సమీపంలో పర్సెవరెన్స్‌ రోవర్‌ దిగింది. అంగారకుడి ఉపరితలంపై ఇప్పటివరకు దాదాపు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరిగిన రోవర్‌.. తన పరిశోధనకు అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించింది. ఈ క్రమంలో జైచిరో అగ్నిపర్వతానికి చెందిన రాతిపై డ్రిల్లింగ్‌ చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అగ్నిపర్వతానికి చెందిన లక్షల ఏళ్ల రాతి పొరలను విశ్లేషించడం ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడిపై జీవం, ఉనికితోపాటు భూమి, సూర్యుడి పుట్టుకు గురించి లోతైన అవగాహన దీని ద్వారా లభిస్తుందని చెబుతున్నారు. 

చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించేందుకు నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌కు 3.35 నిమిషాలు పడితే.. అంగారకుడిపై మట్టి నమూనాలను సేకరించేందుకు రోవర్‌కు దాదాపు 11 రోజుల సమయం పడుతుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూమి నుంచి లక్షల మైళ్ల దూరంలో ఉన్న రోవర్‌కు సందేశాలు అందేందుకు చాలా సమయం పడుతుందన్నారు. రోవర్‌ మట్టి నమూనాలు సేకరించిన తర్వాత వాటిని భూమి మీదకు తీసుకువచ్చి పరిశోధనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అంగారకుడిపై ఉన్న రాతి పొరల ఆకృతి, వాటి రసాయనాల సమ్మేళనం, ఖనిజాల తీరును అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అంగారకుడిపై పర్సెవరెన్స్‌ సేకరించిన మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకొచ్చేందుకు 2026లో మరో రాకెట్‌ ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. 2031లోగా అరుణుడి మట్టి నమూనాలు భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని