Molnupiravir: కొవిడ్‌ చికిత్స అనుమతివ్వండి!

నాట్కో ఫార్మా తయారుచేసిన మోల్నుపిరావిర్‌ ఔషధం మూడోదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు చేసుకున్నట్లు నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది.

Updated : 26 Apr 2021 15:19 IST

‘సీడీఎస్‌సీఓ’కు నాట్కో ఫార్మా దరఖాస్తు

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. చికిత్సలో వినియోగించే ఔషధాలపై ఫార్మా సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా నాట్కో ఫార్మా తయారుచేసిన ‘మోల్నుపిరావిర్‌’ ఔషధం మూడోదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు చేసుకున్నట్లు నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది.

‘కరోనా రోగులపై మోల్నుపిరావిర్‌ ఔషధం మూడోదశ ప్రయోగాలు జరిపేందుకు సీడీఎస్‌సీఓకు దరఖాస్తు చేసుకున్నాం’ అని నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ ఔషధం ఇన్‌ఫ్లుయెంజాకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు కరోనా వైరస్‌కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 ప్రతిరూపాన్ని నిరోధించడంలో శక్తిమంతంగా పనిచేసినట్లు ప్రీ-క్లినికల్‌ ప్రయోగ ఫలితాల్లో తేలినట్లు నాట్కో ఫార్మా పేర్కొంది. క్యాప్సూల్‌ రూపంలో ఉండే మోల్నుపిరావిర్‌ ఔషధం తీసుకున్న ఐదురోజుల్లోనే రోగుల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని.. తద్వారా స్వల్ప వ్యవధిలోనే రోగులు కోలుకోకుంటారనే విషయాన్ని ఇది సూచిస్తుందని నాట్కో సంస్థ గుర్తుచేసింది. ఈ ఔషధాన్ని మాత్రల రూపంలో(నోటిద్వారా) తీసుకునే సౌలభ్యం ఉండడం మరో ప్రయోజనకర విషయమని పేర్కొంది.

ఇప్పటివరకు ఉన్న ప్రయోగ ఫలితాల సమాచారంపై పూర్తి విశ్వాసం ఉన్నందున తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి ఇస్తుందని భావిస్తున్నామని నాట్కో ఫార్మా అభిప్రాయపడింది. ఒకవేళ అనుమతి లభిస్తే.. ఈ ఔషధాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకువస్తామని నాట్కో ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే, కరోనా చికిత్సలో వాడేందుకు జైడస్‌ క్యాడిల్‌ తయారుచేసిన ‘విరాఫిన్‌’కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఒకే మోతాదులో వాడే విరాఫిన్‌ యాంటీవైరల్‌ ఇంజక్షన్‌ కొవిడ్‌ చికిత్సలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జైడస్‌ సంస్థ పేర్కొంది. మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు. ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్ర రూపంలో ఉండే ఔషధ అనుమతి కోసం నాట్కో ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని