Delhi: మీకు మద్దతిస్తున్నాం.. మాకు ఇవ్వరా?: కేజ్రీ

దేశ రాజధాని దిల్లీలో ఇంటివద్దకే రేషన్‌ పథకానికి అనుమతించవలసిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి లేఖ రాశారు. ఆప్‌ ప్రభుత్వం కేంద్రానికి మద్దతిస్తున్నందున ఈ విషయంలో కేంద్రం కూడా కాస్త చొరవ చూపాలని, ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పథకానికి అనుమతివ్వాలని లేఖలో కోరారు. ‘‘ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నాం.

Published : 09 Jun 2021 01:43 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఇంటివద్దకే రేషన్‌ పథకానికి అనుమతించవలసిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి లేఖ రాశారు. ఆప్‌ ప్రభుత్వం కేంద్రానికి మద్దతిస్తున్నందున ఈ విషయంలో కేంద్రం కూడా కాస్త చొరవ చూపాలని, ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పథకానికి అనుమతివ్వాలని లేఖలో కోరారు. ‘‘ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నాం. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కూడా జాతీయ ప్రయోజనం లాంటిదే. రేషన్‌ పంపిణీ విషయంలో కేంద్రం ఏవైనా మార్పులు సూచిస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కరోనా విజృంభణ సమయంలో ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం. కేవలం దిల్లీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ దీనిని అమలు చేయాల్సిన అవసరం ఉంది.’’ అని కేజ్రీవాల్‌ తన లేఖలో పేర్కొన్నారు.  

దాదాపు 72 లక్షల మంది లబ్ధిదారులకు మేలు చేసే ఈ పథకానికి కేంద్రప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తోందని ట్విటర్ వేదికగా ఇటీవల ఆప్‌ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేషన్‌ మాఫియాతో ఉన్న సంబంధాల కారణంగానే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ట్విటర్‌లో విమర్శలు గుప్పించింది. వాస్తవానికి మార్చిలోనే ఈ పథకం ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో  కేంద్రం అడ్డు చెప్పడంతో అప్పట్లో నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ సమయంలో పిజ్జాలు, బర్గర్లు, దుస్తులు, స్మార్ట్‌ఫోన్లు డోర్‌ డెలివరీ చేస్తే తప్పుకానిది, రేషన్‌ను ఇంటింటికీ పంపిణీ చేయడం తప్పెలా అవుతుందని ఆప్‌ సర్కారు కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం అనుమతి అక్కర్లేదని, అయితే.. ఎలాంటి వివాదాల జోలికి పోకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం అనుమతి కోరుతున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని