మరణాలు తగ్గినా... జాగ్రత్తలు మరవొద్దు

దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టినా, ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. కొవిడ్‌ టీకాలను విస్తృతంగా అందిస్తుండటంతో గత ఆరు నెలల్లో మరణాలు 90%

Published : 22 Jul 2021 05:46 IST

 ‘డెల్టా’ పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారంతా టీకాలు తీసుకోనివారే

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  

వాషింగ్టన్‌: దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టినా, ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. కొవిడ్‌ టీకాలను విస్తృతంగా అందిస్తుండటంతో గత ఆరు నెలల్లో మరణాలు 90% తగ్గాయన్నారు. అయితే... శరవేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరుతున్న, మృతిచెందుతున్న వారిలో దాదాపు అందరూ టీకా తీసుకోనివారేనని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన తర్వాత బైడెన్‌ మంగళవారం రెండోసారి తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై మాట్లాడారు. ‘‘మళ్లీ చెబుతున్నా. వ్యాక్సిన్‌ తీసుకోనివారే ఆసుపత్రులపాలై, మరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. టీకాలు భద్రమైనవి. ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ తీసుకోనివారికి వాటిని అందించడంపై తదుపరి దశలో దృష్టి సారిస్తాం. ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించేందుకు అమెరికా కృషి చేస్తోంది. ఉద్యోగాలను సృష్టించడంలో, మధ్య తరగతి చ్కీజీజివితాలను మెరుగుపరచడంలో నిమగ్నమైంది. మా ప్రయత్నాలకు అమెరికా ప్రజలు విశేషంగా మద్దతు పలుకుతున్నారు. అందుకే మా ఆర్థిక వ్యవస్థ చరిత్రాత్మక ప్రగతిని నమోదు చేస్తోంది’’ అని బైడెన్‌ చెప్పారు.

డెల్టాతో బెంబేలు...

గత డిసెంబరులో భారత్‌లో తొలిసారి వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌ (బి.1.617.2) ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 80% పైగా డెల్టా వేరియంట్‌కు చెందినవే! అమెరికా వ్యాప్తంగా చూస్తే 51.7% కేసులు డెల్టా వైరస్‌ కారణంగా తలెత్తుతున్నవేనని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తెలిపింది. గతవారంలో దేశ వ్యాప్తంగా సగటున రోజూ 32,278 కేసులు నమోదయ్యాయి. కిందటి వారం నాటి కేసుల సగటుతో పోల్చితే ఈ సంఖ్య 66%, రెండు వారాల కిందటి సగటు కంటే 145% అధికం! డెల్టా వేరియంట్‌ మరికొన్ని వారాల్లో ఉద్ధృతంగా వ్యాపించే ముప్పుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేశారు. ఎక్కువమంది చిన్నారులు ఈ వైరస్‌ బారిన పడవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో వ్యాక్సిన్లపై అపోహలను పోగొట్టి, టీకా కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టేందుకు అధ్యక్ష భవనం చర్యలకు ఉపక్రమించింది.

శ్వేతసౌధంలో కలకలం...

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూశాయి. టీకాలు వేయించుకున్న అధికారులు కొవిడ్‌ బారిన పడటం కలకలం రేపుతోంది. కిందిస్థాయి అధికారుల్లో కొందరు కొవిడ్‌ బారిన పడ్డారని, వారికి స్వల్పంగానే లక్షణాలు ఉన్నాయని అధ్యక్షుడి మీడియా కార్యదర్శి జెన్‌ సాకి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ, ఎంతమందికి వైరస్‌ సోకిందన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే, సదరు అధికారులు అధ్యక్షడు బైడెన్‌తోగానీ, ఉన్నతాధికారులతోగానీ కలవలేదని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు