Published : 25 Jun 2022 06:07 IST

నిత్యం నిప్పు రాజేసే యత్నం

..అందుకే ఏళ్ల తరబడి పిటిషన్ల పేరుతో కోర్టు ముందుకు
విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు.. వారిపై చర్యలు అవసరం
గుజరాత్‌ హింసపై   పునర్విచారణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ప్రధాని మోదీ సహా 64 మందికి సిట్‌ క్లీన్‌చిట్‌ సబబేనని ప్రకటన
జాకియా జాఫ్రీకి చుక్కెదురు

దిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 63 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ అల్లర్ల వెనుక భారీ కుట్ర కోణం ఉందని, దీనిపై పునర్విచారణ జరిపించాలని కోరుతూ నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్‌ దివంగత ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. 2002 ఫిబ్రవరి 27 గోద్రా మారణహోమం తర్వాత ఓ వర్గంపై పెద్దఎత్తున హింసకు పాల్పడేలా రాష్ట్రంలో ‘అత్యున్నత స్థాయిలో’ జరిగిన నేరపూరిత కుట్రలో భాగంగానే.. ముందస్తు ప్రణాళిక ప్రకారం అల్లర్లు చోటుచేసుకున్నట్లు పిటిషనర్‌ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. వాటిని సమర్థించేందుకు సిట్‌ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదని స్పష్టంచేసింది. ఈ పిటిషన్‌కు విచారణ యోగ్యత లేదని పేర్కొంది. ‘‘ఆ ఘటనపై నిత్యం వివాదం రగులుతూ ఉండేలా 2006 నుంచి దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసినట్లు స్పష్టమవుతోంది. విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములైనవారందరిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి’’ అంటూ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు 452 పేజీల తీర్పును వెలువరించింది.
2002లో గుజరాత్‌లో గోద్రా ఘటన, అనంతర హింసలో 1,044 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్‌ సొసైటీలో అల్లరిమూకలు జరిపిన దాడుల్లో కాంగ్రెస్‌ ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రీ సహా 68 మంది మరణించారు. నాటి ముఖ్యమంత్రి మోదీ సహా 64 మందికి అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని తేలుస్తూ సిట్‌ తుది నివేదిక ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ జాకియా 2012 ఫిబ్రవరి 9న మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ కోర్టు సిట్‌ నివేదికను సమర్థించడంతో గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 2017 అక్టోబరు 5న ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం సిట్‌ నివేదికపై మెట్రోపాలిటన్‌ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. పిటిషనర్‌ ఏళ్లతరబడి న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటం వెనుక ఉద్దేశంపై కీలక వ్యాఖ్యలు చేసింది ‘‘ఈ విచారణ 16 ఏళ్లుగా కొనసాగుతోంది. 2006లో జూన్‌ 8న ఫిర్యాదు నమోదు, 2013 ఏప్రిల్‌ 15న నిరసన పిటిషన్‌ దాఖలు చేయడం, ఈ మోసపూరిత వ్యూహాన్ని బహిర్గతం చేసే విచారణ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి సమగ్రతను ప్రశ్నించే ధైర్యం చేయడం.. ఇవన్నీ నాటి ఘటనపై వివాదాన్ని రాజేస్తూ ఉండటానికి దురుద్దేశంతో చేసిన చర్యే. ఇందుకోసం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేసినవారందరినీ చట్టప్రకారం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడంలో 216 రోజుల జాప్యాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. అందుకు పిటిషనర్‌ తెలిపిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంది. ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ ఈ కేసులో రెండో పిటిషనర్‌గా చేరడంపై ప్రతివాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపింది. అయినా విషయ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌పై విచారణకు అంగీకరించినట్లు తెలిపింది.

కొందరు అధికారుల వైఫల్యాన్ని కుట్ర అని చెప్పలేం

సిట్‌ విచారణ ప్రక్రియలోనూ, 2012 ఫిబ్రవరి 8న అది ఇచ్చిన తుది నివేదికలోనూ ఎలాంటి లోపాలు కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భారీ నేరపూరిత కుట్రకు సంబంధించిన ఆరోపణలపై సిట్‌ విశ్లేషణాత్మక దృక్పథంతో, అన్ని కోణాల్లోనూ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టిందని పేర్కొంది. అనేక సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ సిట్‌ బృందం అలుపులేని కృషితో, ఎలాంటి హానికర పరిణామాలకు గురికాకుండా విచారణ పూర్తి చేసిందని ధర్మాసనం ప్రశంసించింది. సిట్‌ తుది నివేదికకు సంబంధించి మేజిస్ట్రేట్‌ కోర్టు, హైకోర్టు తీర్పులను సమర్థిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘దర్యాప్తు సమయంలో లభ్యమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సిట్‌ తన నివేదికను రూపొందించింది. నేరపూరిత కుట్రకు సంబంధించి కొత్త ఆధారాలు లభ్యమైతేనే మరోసారి విచారణ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత సందర్భంలో అలాంటి కారణాలు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘గుజరాత్‌లోని కొందరు అసంతృప్త ప్రభుత్వాధికారులు ఇతరులతో కలసి రాజకీయంగా సంచలనం సృష్టించేందుకే అసత్యాలను వ్యాప్తి చేశారు. ఆ కుట్రను సిట్‌ బహిర్గతం చేసింది’’ అని ధర్మాసనం పేర్కొంది. నాటి సీఎం సమక్షంలో అల్లర్ల వ్యూహరచనకు జరిగిన సమావేశానికి తాము ప్రత్యక్ష సాక్షులమని అప్పటి ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌, గుజరాత్‌ మాజీ హోం మంత్రి హరేన్‌ పాండ్యాలు తప్పుడు ప్రకటనలు చేశారని, సిట్‌ దర్యాప్తులో అవి అసత్యాలని తేలిందని ధర్మాసనం తెలిపింది. ‘‘పరిపాలనలోని ఓ విభాగానికి చెందిన కొందరు అధికారుల నిష్క్రియాత్మకత లేదా వైఫల్యం.. అధికారుల ముందస్తు నేరపూరిత కుట్రగానో, మైనార్టీలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత నేరంగానో పేర్కొనడానికి ఆధారం కాదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశ చెందినట్లు ఎహ్‌సాన్‌, జాకియాల కుమారుడు తన్వీర్‌ జాఫ్రీ పేర్కొన్నారు. తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత తన స్పందనతో సమగ్ర ప్రకటనను విడుదల చేస్తానని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించింది. కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకుర్‌, స్మృతి ఇరానీ తదితరులు ఈ మేరకు ట్విటర్‌లో ఆనందం వ్యక్తం చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని