October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్‌’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు

స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదాన్‌ (Shramdaan for Swachhata) పేరుతో దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1న పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 24 Sep 2023 20:17 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒకేరోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని (Cleanliness Drive) చేపట్టనున్నారు. స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదాన్‌ (Shramdaan for Swachhata) కార్యక్రమాన్ని అక్టోబర్‌ 1న నిర్వహించనున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. గాంధీ జయంతిని (అక్టోబర్‌ 2) పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని చేపట్టనున్నట్లు తెలిపింది.

‘మన్‌ కీ బాత్‌’ 105వ ఎపిసోడ్‌లో భాగంగా ప్రధాని మోదీ చేసిన రేడియో ప్రసంగంలో ‘స్వచ్ఛత కోసం ఓ గంట శ్రమదానం చేయండి’ అని పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 1న ఉదయం 10గంటలకు సమష్టిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఇది ‘స్వచ్ఛాంజలి’ అవుతుందన్నారు.

హైదరాబాద్‌ బాలికను ప్రశంసించిన ప్రధాని

అక్టోబర్‌ 1న మార్కెట్లు, రైల్వే ట్రాకులు, పర్యాటక కేంద్రాలు, నీటి వనరులు, ప్రార్థనా మందిరాలతోపాటు జనసముదాయ ప్రాంతాల్లో చేపట్టే ఈ భారీ శుభ్రతా కార్యక్రమంలో పాల్గొనాలని పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి పట్టణం, ప్రతి గ్రామ పంచాయతీతోపాటు పౌర విమానయానం, రైల్వేలు, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థల్లోనూ స్థానిక పౌరుల భాగస్వామ్యం ఉంటుందని తెలిపింది. ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఎన్‌జీవోలు, సంక్షేమ సంఘాలు, ప్రైవేటు సంస్థలు.. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్లై చేసుకోవడం లేదా జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని