‘నావల్నీ ఏ క్షణమైనా చనిపోవచ్చు’

జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణించే అవకాశం ఉందని ఆయన వ్యక్తిగత వైద్య బృందం తెలిపింది. మూడు వారాలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వారు తెలిపారు.......

Updated : 18 Apr 2021 12:05 IST

రష్యా ప్రతిపక్ష నాయకుడి ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన

మాస్కో: జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణించే అవకాశం ఉందని ఆయన వ్యక్తిగత వైద్య బృందం తెలిపింది. మూడు వారాలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వారు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వైద్య నివేదికలను పరిశీలిస్తే ఆయనలో పొటాషియం స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరినట్లు తెలుస్తోందన్నారు. ఇది ఏ క్షణంలోనైనా గుండెపోటుకు దారితీయొచ్చని పేర్కొన్నారు. అలాగే క్రియాటినైన్‌ స్థాయిలు సైతం విపరీతంగా పెరిగిపోయాయని.. ఇది కిడ్నీలు దెబ్బతిన్నాయడానికి సంకేతమని తెలిపారు.

‘‘నావల్నీ ఏ క్షణమైనా మరణించొచ్చు’’ అని ఆయన వ్యక్తిగత వైద్యుడు యారోస్లోవ్‌ అశిఖ్‌మిన్‌ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. అలాగే నావల్నీ వైద్య బృందానికి నేతృత్వం వహిస్తున్న వైద్యుడు అనస్టాసియా వసిల్‌యేవా స్పందిస్తూ.. ‘వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ట్విటర్‌ ద్వారా తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నాయకుడే అలెక్సీ నావల్నీ. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగింది. దాదాపు ఐదు నెలల పాటు జర్మనీలో చికిత్స పొందారు. పుతిన్‌పై పోరాటం ఆపేది లేదంటూ తిరిగి రష్యాకు చేరుకున్న ఆయన్ని జనవరి 17న పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అనేక అవినీతి కేసులు మోపారు. కోర్టు ఆయనకు రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించింది.

అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్న నావల్నీ తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, చికిత్స అందజేయడానికి తన వైద్య బృందాన్ని పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన నిరాహార దీక్షకు దిగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని