Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్‌ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!

ఓ ఘర్షణ కేసులో జైలుపాలయ్యిన కాంగ్రెస్‌ పంజాబ్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ శనివారం విడుదలయ్యారు. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

Updated : 01 Apr 2023 18:50 IST

చండీగఢ్‌: మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న పంజాబ్‌ (Punjab) కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) విడుదలయ్యారు. గతేడాది మే నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఏడాది శిక్ష ప్రకారం ఆయన.. మే నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే, జైల్లో సత్ప్రవర్తన దృష్ట్యా ఆయనకు 48 రోజులు శిక్ష నుంచి ఉపశమనం లభించిందని సిద్ధూ తరఫు న్యాయవాది వెల్లడించారు. అన్ని లాంఛనాలు పూర్తయిన అనంతరం.. సాయంత్రం పటియాలా కారాగారం(Patiala Jail) నుంచి సిద్ధూ బయటకు వచ్చారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం సిద్ధూ మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం అంటూ ఏం లేదు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు కుట్ర జరుగుతోంది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పంజాబ్‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తే.. వారే బలహీనంగా మారతారు. నేను మధ్యాహ్నమే విడుదల కావాల్సింది. కానీ, ఆలస్యం చేశారు. మీడియా వారిని వెళ్లిపోవాలని కోరారు. ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడల్లా ఒక విప్లవం కూడా వచ్చింది. ఈసారి ఆ విప్లవం పేరు రాహుల్ గాంధీ. ఆయన ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేస్తారు’ అంటూ సిద్ధూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఇదిలా ఉండగా.. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న పటియాలాలో పార్కింగ్‌ విషయంలో జరిగిన ఘర్షణలో 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్ధూతోపాటు రూపిందర్‌ సింగ్‌పై.. దాడి చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై పలు కోర్టుల్లో విచారణ ముగిసిన అనంతరం.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు 2022 మే నెలలో తీర్పువెలువరించింది. దీంతో మే 20న కోర్టుముందు లొంగిపోయిన సిద్ధూను పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే 10 నెలల అనంతరం నేడు విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని