Updated : 26 May 2022 15:42 IST

Navjot Singh Sidhu: జైల్లో క్లర్క్‌గా పనిచేయనున్న సిద్ధూ.. జీతం ఎంతో తెలుసా..?

చండీగఢ్‌: మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది శిక్ష పడటంతో కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) ప్రస్తుతం పటియాలా సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షా కాలంలో ఆయన జైల్లో క్లర్క్‌గా పనిచేయనున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.

సాధారణంగా కఠిన కారాగార శిక్ష పడిన ఖైదీలకు జైల్లో పనులు అప్పగిస్తారు. ఇందులో భాగంగానే సిద్ధూకు క్లరికల్‌ వర్క్‌ను అప్పగించాలని నిర్ణయించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. సిద్ధూ 
ప్రముఖ వ్యక్తి కావడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా ఇతర ఖైదీల్లా జైలు గది నుంచి బయటకు వచ్చి చేసే పనులు అప్పగించలేదని అధికారులు తెలిపారు. ఆయన తనకు కేటాయించిన సెల్‌లోనే క్లర్క్‌గా పనిచేయనున్నట్లు చెప్పారు. ఆ గదికే ఫైళ్లను పంపనున్నట్లు తెలిపారు. సిద్ధూ రోజుకు రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు) పనిచేయనున్నారు.

తొలి మూడు నెలల పాటు సిద్ధూను ట్రైనీగా పరిగణించి ఈ పనిలో శిక్షణ ఇవ్వనున్నారు. సుదీర్ఘమైన కోర్టు తీర్పులను బ్రీఫింగ్‌ చేయడం, జైలు రికార్డులను రాయడం వంటి వాటిని నేర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు గానూ.. తొలి మూడు నెలల పాటు సిద్ధూకు ఎలాంటి వేతనం ఇవ్వబోరు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయన నైపుణ్యాలను బట్టి రోజుకు రూ.40 నుంచి రూ.90 వరకు వేతనం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సిద్ధూ క్లర్క్‌గా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు.

34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు ఇటీవల సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 డిసెంబరు 27న.. సిద్ధూ, ఆయన స్నేహితుడైన రూపిందర్‌సింగ్‌ సంధూ పటియాలాలో రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గుర్నాంసింగ్‌ (65) వాహనాన్ని పక్కకు తీయమని పదేపదే కోరారు. ఆవేశంతో మిత్రులు ఇద్దరూ వృద్ధుడిని కారు నుంచి బయటకు లాగి చితకబాదారన్నది ఈ కేసులో అభియోగం. గాయపడిన గుర్నాంసింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత పటియాలా జిల్లా సెషన్స్‌ కోర్టు, ఆపై పంజాబ్, హరియాణా హైకోర్టు.. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరిన ఈ కేసులో సిద్ధూకు శిక్ష పడింది. ఈ కేసులో సిద్ధూ లొంగిపోవడంతో ఆయనను పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts