
Lakhimpur Kheri violence: రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో.. సిద్ధూ వార్నింగ్!
చండీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా ఆమెను విడుదల చేయాలని చేసి, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పంజాబ్ నుంచి లఖింపుర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని యూపీ పోలీసులను హెచ్చరించారు.
‘‘రైతుల దారుణ హత్యకు కారణమైన కేంద్రమంత్రి కుమారుడిని రేపటిలోగా అరెస్టు చేయాలి. అన్నదాతల కోసం పోరాడేందుకు వచ్చిన మా నాయకురాలు ప్రియాంక గాంధీని చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఆమెను రేపటిలోగా విడుదల చేయాలి. లేదంటే పంజాబ్ కాంగ్రెస్ లఖింపుర్ ఖేరి వరకు మార్చ్ నిర్వహిస్తుంది’’ అని సిద్ధూ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్ ఖేరీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అక్కడి తికోనియా-బన్బీర్‌పుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... ఓ కారు వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతులు జరిపిన దాడిలో మరో నలుగురు మృతిచెందారు. ఈ అల్లర్లలో ఓ విలేకరి కూడా ప్రాణాలు కోల్పోయారు. లఖింపుర్ ఖేరి ఘటనలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని సీతాపూర్ వద్ద పోలీసులు అరెస్టు చేసి, సమీపంలోని ఓ అతిథి గృహానికి తరలించారు.
రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్‌ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు ఆశిష్ సహా కొందరిపై కేసు నమోదు చేశారు. అయితే ఆయనను ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.