Navjot Singh: సిద్ధూ భార్యకు క్యాన్సర్‌.. ‘ఇక వేచి ఉండలేనంటూ’ ట్వీట్‌

ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ నాయకుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) భార్య క్యాన్సర్‌ (Cancer) బారినపడినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ స్వయంగా వెల్లడించారు.

Published : 24 Mar 2023 01:37 IST

చండీగఢ్‌: మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన భార్య నవ్‌జ్యోత్‌ కౌర్‌ సిద్ధూ క్యాన్సర్‌ (Invasive Cancer) బారిన పడినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో స్వయంగా వెల్లడించిన ఆమె.. తన భర్త కోసం ఎంతో వేచిచూస్తున్నానని అన్నారు. జైల్లో ఉన్న సిద్ధూ కంటే బయట ఉన్న తానే ఎక్కువ బాధను అనుభవిస్తున్నానంటూ నవ్‌జ్యోత్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

‘చేయని నేరానికి ఆయన (సిద్ధూ) జైల్లో ఉన్నాడు. వారందర్నీ క్షమించు. బయట ఉన్న నేను.. నీ కంటే ఎక్కువగా బాధపడుతూ.. నిత్యం నీ కోసమే ఎదురుచూస్తున్నా. నిజం ఎంతో శక్తిమంతమైనది అయినప్పటికీ.. అది నిన్ను ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంది. మీతో ఓ విషయం పంచుకోవాలని అనుకుంటున్నా. శరీరంలో చిన్న కణతి ఏర్పడింది. అయితే, అది స్టేజ్‌-2 రొమ్ము క్యాన్సర్‌ అని తేలింది. నీ కోసం వేచి ఉండలేకపోతున్నా. సర్జరీకి వెళ్తున్నా. దీనికి ఎవ్వర్నీ నిందించలేము. ఎందుకంటే అది దేవుడు చేసిన నిర్ణయం’ అంటూ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఎంతో వేదనతో తాను క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని వెల్లడించారు.

ఇదిలాఉంటే, 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్‌ విషయంలో 65ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్‌ సింగ్‌లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుర్నామ్‌ సింగ్‌ను కారు నుంచి బయటకు లాగి సిద్ధూ- రూపిందర్‌ సింగ్ అతడి తలపై దాడి చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. తీవ్రంగా గాయపడిన గుర్నామ్‌ సింగ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసు తొలుత పటియాలా జిల్లా సెషన్స్‌ కోర్టు, ఆపై పంజాబ్, హరియాణా హైకోర్టు.. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. చివరకు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు 2022 మే నెలలో తీర్పువెలువరించింది. దీంతో సిద్ధూ కోర్టుముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన పటియాలా సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని