INS Visakhapatnam: విధుల్లోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’.. ప్రత్యేకతలెన్నో!

దేశ తీరప్రాంత రక్షణకు ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ నౌక ఆదివారం ముంబయిలో విధుల్లో చేరింది....

Updated : 21 Nov 2021 13:02 IST

ముంబయి: దేశ తీరప్రాంత రక్షణకు ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ నౌక ఆదివారం ముంబయిలో విధుల్లో చేరింది. ఇదే భారత తొలి ‘స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌’ కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు నౌకాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘ప్రాజెక్టు15బీ’ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను తయారు చేస్తున్నారు. ముంబయి మజగాన్‌ డాక్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ నౌకను నిర్మించారు. నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టే సంప్రదాయానికి అనుగుణంగా విశాఖకు కేటాయించిన నౌకకు ‘ఐ.ఎన్‌.ఎస్‌.విశాఖపట్నం’ అని నామకరణం చేశారు. మున్ముందు తూర్పునౌకాదళ పరిరక్షణలో కీలకపాత్ర పోషించనుంది.

ప్రత్యేకతలెన్నో... 

బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను దీన్నించి ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాల్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు. రెండు మల్టీరోల్‌ హెలీకాప్టర్లు ఇందులో ఉంటాయి.

డాల్ఫిన్స్‌ నోస్‌ కొండకు గుర్తింపు... 

నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రకు విశాఖలోని డాల్ఫిన్‌ నోస్‌ కొండ, దానిపై దీపస్తంభానికి స్థానం కల్పించారు. నౌక గుర్తింపు చిహ్నం(లోగో)గా కొమ్ములతో కనిపించే కృష్ణ జింక ముఖం ముందుభాగాన్ని ఖరారు చేశారు. అత్యంత అప్రమత్తతకు, తీవ్రమైన వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని పొందుపరిచారు. అప్రమత్తతో, పరాక్రమంతో, విజేతగా నిలువాలన్న లక్ష్యాన్ని చిహ్నం కింద చేర్చారు. హిందూ మహాసముద్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనా బాధ్యతారహిత దేశం..

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. డ్రాగన్‌ను బాధ్యతారహిత దేశంగా అభివర్ణించారు. ‘‘కొన్ని బాధ్యతారహిత దేశాలు తమ సంకుచిత, పక్షపాత ప్రయోజనాల కోసం, ఆధిపత్య ధోరణులతో ఐరాస ‘కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ(UNCLOS)’ని తప్పుగా నిర్వచిస్తున్నాయి. ఇలా ఏకపక్ష  వివరణల వల్ల యూఎన్‌సీఎల్‌ఓఎస్‌ పదేపదే బలహీనపడటం ఆందోళన కలిగిస్తోంది’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని