Updated : 07 Nov 2021 13:31 IST

Nawab Malik: షారుక్ ఖాన్‌.. ఇప్పటికైనా నోరు విప్పు: నవాబ్‌ మాలిక్‌

డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో నవాబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు

ముంబయి: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు విషయంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ కావడం వెనుక భాజపా నేత మోహిత్ కాంబోజ్‌ అనే వ్యక్తే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా అపహరణ, డబ్బు డిమాండ్‌కు సంబంధించింది మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

షారుక్‌ ఖాన్‌ ఇప్పటికైనా నిజాలు చెప్పాలి..

అసలు ఆర్యన్‌ ఖాన్‌ క్రూజ్‌ పార్టీకి టిక్కెట్టే కొనుగోలు చేయలేదని నవాబ్‌ మాలిక్‌ అన్నారు. ప్రతీక్‌ గాబా, అమీర్‌ ఫర్నీచర్‌వాలా అనే ఇద్దరు వ్యక్తులే ఆయన్ని అక్కడికి తీసుకెళ్లారన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు పూర్తిగా కిడ్నాపింగ్‌, డబ్బు డిమాండ్‌కు సంబంధించినదని చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే, మోహిత్‌ కాంబోజ్‌ ఇద్దరూ డబ్బు డిమాండ్‌ చేసిన వారిలో ఉన్నారని ఆరోపించారు. ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన తొలిరోజు నుంచి షారుక్‌ ఖాన్‌కు బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడొద్దని షారుక్‌కు ఆదేశాలిస్తున్నారనన్నారు. ఇప్పటికైనా షారుక్‌ బయటకు వచ్చి నోరు విప్పాలన్నారు. కుమారుణ్ని కిడ్నాప్‌ చేస్తే డబ్బు ఇవ్వడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు.

అసలు విషయం అందులోనే..

ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే, మోహిత్‌ కాంబోజ్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని నవాబ్‌ మాలిక్‌ అన్నారు. అక్టోబరు 7న వీరిద్దరూ ఓ శ్మశానం వద్ద కలిశారని ఆరోపించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే తాను పెట్టిన ఓ ప్రెస్‌ మీట్‌ను ఈ సందర్భంగా మాలిక్‌ గుర్తుచేశారు. నౌక నుంచి అదుపులోకి తీసుకున్నవారిలో ముగ్గుర్ని ఎందుకు వదిలేశారని తాను అప్పట్లోనే ప్రశ్నించానన్నారు. అప్పుడు వదిలేసిన వారిలో రిషభ్‌ సచ్‌దేవ, ప్రతీక్‌ గాబా, అమీర్‌ ఫర్నీచర్‌వాలా ఉన్నారన్నారు. మోహిత్‌ కాంబోజ్‌కు రిషభ్‌ సచ్‌దేవ దగ్గరి బంధువని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గుర్ని వదిలేయడంలోనే అసలు విషయం దాగి ఉందని ఆరోపించారు.

ఆయన్ని అక్కడే ఆపేశారు...

ఇక మోహిత్‌ కాంబోజ్‌ ఆరోపిస్తున్నట్లుగా తానెప్పుడూ సునీల్‌ పాటిల్‌ అనే వ్యక్తిని కలవలేదన్నారు. ఈ కేసుపై తొలిసారి తాను ప్రెస్‌ మీట్‌ పెట్టిన వెంటనే సునీల్‌ పాటిల్‌ ఫోన్‌ చేశారన్నారు. తనతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నానని చెప్పారన్నారు. అయితే, పోలీసులతో చెప్పాలని తాను సూచించానన్నారు. కానీ, గుజరాత్‌లోనే ఆయన్ని నిలిపివేశారన్నారు.

ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయాలన్న కుట్ర..

ఈ వ్యవహారమంతా ఓ కుట్రలో భాగంగానే జరిగిందని నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. క్రూజ్‌ షిప్‌లో ఫ్యాషన్‌ టీవీ ఇండియా ఎండీ కషిఫ్‌ ఖాన్‌కు సంబంధించిన ‘స్మోకింగ్‌ రోల్స్‌’ కూడా దొరికాయన్నారు. మరి ఆయన్నెందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌ను కూడా పార్టీకి రావాలని కషిఫ్‌ ఖాన్‌ బలవంతం చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు.

కోర్టుకు వెళ్లొచ్చు కదా?

నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలపై ఎన్సీబీ అధికారులు స్పందించారు. సమీర్‌ వాంఖడేపై ఆరోపణలు చేస్తున్న ఆయన కోర్టును ఎందుకు సంప్రదించడం లేదని  ప్రశ్నించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని