Drugs Case: ‘బాలీవుడ్‌ నటుల ఫోన్లు ట్యాప్‌ చేసిన వాంఖడే’..!

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహరం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్‌సీబీ

Updated : 26 Oct 2021 12:40 IST

సంచలన లేఖ బయటపెట్టిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌

ముంబయి: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహరం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తరపున డబ్బు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌.. ఓ సంచలన లేఖను బయటపెట్టారు. సమీర్‌ వాంఖడే బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసి, వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవారని మాలిక్‌ తాజాగా ఆరోపించారు. 

ఈ ఉదయం నవాబ్‌ మాలిక్‌ ఇంటికి గుర్తుతెలియని ఎన్‌సీబీ సిబ్బంది పేరుతో ఓ లేఖ వచ్చింది. ఆ లేఖను మంత్రి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. సమీర్‌ వాంఖడే  బాలీవుడ్‌ నటుల ఫోన్లను అక్రమంగా ట్యాప్‌ చేయించారని ఆ లేఖలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘ముంబయి, ఠాణెల్లోని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో వాంఖడే ప్రముఖ వ్యక్తులు, బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు సమాచారం అందింది. ఆయన మా ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తున్నారు. నా కుమార్తె నిలోఫర్‌ కాల్‌ డేటా రికార్డ్‌ కావాలని ముంబయి పోలీసులను అడిగారట. అయితే, పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. 26 కేసుల దర్యాప్తు సమయంలో వాంఖడే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కొందరిపై తప్పుడు కేసులు బనాయించారని లేఖలో ఉంది’’ అని మాలిక్‌ వెల్లడించారు. ఈ లేఖను తాను సీఎం, డీజీ కార్యాలయాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వాంఖడేపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ లేఖపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. 

అదో పెద్ద జోక్‌: వాంఖడే

నవాబ్‌ మాలిక్‌ షేర్‌ చేసిన లేఖను సమీర్‌ వాంఖడే ఖండించారు. ఆ లేఖ పెద్ద జోక్‌, అబద్ధమని కొట్టిపారేశారు. అందులో ఉన్నదంతా తప్పుడు సమాచారమని అన్నారు. మాలిక్ తనపై ఎన్ని ఆరోపణలైనా చేసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ ఆయనకు ఉందని అన్నారు. కాగా.. ఈ లేఖను దర్యాప్తు చేస్తామని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌ అశోక్‌ జైన్‌ చెప్పారు. 

క్రూయిజ్‌ నౌక కేసులో అరెస్టయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను విడుదల చేయడానికి రూ.25కోట్లు డిమాండ్‌ చేశారంటూ ప్రభాకర్‌ సాయీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  ఆర్యన్‌ను విడుదల చేయడానికి రూ.25 కోట్లు ఇవ్వాలని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందంటూ ఓ ప్రైవేటు వ్యక్తి మరికొందరితో కలసి షారుక్‌ను డిమాండ్‌ చేసినట్లు ప్రభాకర్‌ ఆదివారం వెల్లడించడం సంచలనం రేపింది. దీంతో ఈ వ్యవహారంలో వాంఖడే సహా మరింకొందరిపై దిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయం విచారణకు ఆదేశించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని