Aryan Khan: డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌..!

బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ప్రముఖ నటుడు షారూక్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో అతడికి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) క్లీన్‌ చిట్‌

Updated : 27 May 2022 16:44 IST

ముంబయి: బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan)కు ఊరట లభించింది. ఈ కేసులో అతడికి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు సీనియర్‌ ఎన్‌సీబీ అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ కేసులో ఆర్యన్‌ ఖాన్‌తో పాటు మరో 19 మందిని ఎన్‌సీబీ గతేడాది అక్టోబరులో అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు మినహా మిగతా అందరూ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే ఆర్యన్‌, మోహక్‌ ఇద్దరు మినహా మిగతా అందరి వద్ద డ్రగ్స్‌ ఉన్నట్లు తొలుత అధికారులు గుర్తించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సిట్‌.. 14 మంది నిందితులపై కేసు నమోదు చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆర్యన్‌ సహా మరో ఆరుగురిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ కేసులో ఎన్‌సీబీ నేడు కోర్టుకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 6వేల పేజీల ఈ ఛార్జ్‌షీట్‌లో 14 మందిపై అభియోగాలు మోపింది. ఆర్యన్‌ఖాన్‌తో పాటు మరో ఆరుగురి వద్ద డ్రగ్స్‌ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ఎన్‌సీబీ వెల్లడించింది.

షారుక్‌కు గొప్ప రిలీఫ్‌..

ఆర్యన్‌కు క్లీన్‌ చిట్ ఇవ్వడంపై సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఆర్యన్‌, అతడి తండ్రి షారుక్‌కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్‌ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదు. అతడిపై కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాల్లేవ్‌. ఇకనైనా ఎన్‌సీబీ తన తప్పు తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అని రోహత్గీ వ్యాఖ్యనించారు. ఆర్యన్ బెయిల్‌ పిటిషన్‌పై అతడి తరఫున రోహత్గీనే వాదించారు.

ముంబయి తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండటం గతేడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. అతడికి జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజు ఆర్యన్‌ను ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో ఆర్యన్‌ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 26న ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ మొదలుపెట్టింది. ఆర్యన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ అక్టోబరు 29న తీర్పు వెలువరించింది. ఈ కేసులో 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్‌.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని