Drugs Case: నటి అనన్య పాండే నివాసంలో ఎన్‌సీబీ సోదాలు..!

బాలీవుడ్‌ ఇండస్ట్రీని డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు

Updated : 21 Oct 2021 13:24 IST

ముంబయి: బాలీవుడ్‌ ఇండస్ట్రీని డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయి జైల్లో ఉండగా.. తాజాగా మరో బాలీవుడ్‌ నటి పేరు తెరపైకి వచ్చింది. యువ నటి అనన్య పాండే నివాసంలో గురువారం ఎన్‌సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఉదయం అనన్య ఇంటికి వెళ్లిన ఎన్‌సీబీ అధికారులు అక్కడ సోదాలు చేపట్టారు. విచారణ నిమిత్తం ఆమెను మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఆమె ఫోన్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.

ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్ విచారణ సందర్భంగా ఎన్‌సీబీ అధికారులు నిన్న కీలక సమాచారాన్ని కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. క్రూయిజ్‌ నౌకపై పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్‌ డ్రగ్స్‌ కోసం ఓ కొత్త నటితో వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు పేర్కొన్న ఎన్‌సీబీ.. ఆ వివరాలను కోర్టుకు సమర్పించింది. ఆ చాట్‌లో ఉన్నది అనన్య పాండే పేరే అని తెలుస్తోంది. 

షారుక్‌ నివాసంలోనూ..

మరోవైపు నటుడు షారుక్‌ నివాసంలోనూ ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం షారుక్‌ తన కుమారుడు ఆర్యన్‌కు కలిసేందుకు ఆర్థర్‌ రోడ్‌ జైలుకెళ్లిన విషయం తెలిసిందే. ఆయన జైలు నుంచి తిరిగెళ్లిన కొద్ది గంటలకే ఎన్‌సీబీ అధికారులు షారుక్‌ నివాసం మన్నత్‌కు వెళ్లడం గమనార్హం. 

ఇదిలా ఉండగా.. ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు మరోసారి నిరాకరించింది. ప్రాథమికంగా చూస్తే నిందితుడు తరచూ మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగానే కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడగానే నిందితుల తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు అక్టోబరు 26న విచారణ చేపట్టనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని