NCRB report: కరోనా వేళ.. వ్యాపారుల ఆత్మహత్యలే ఎక్కువ!

కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలు లేక ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. అటు నష్టాలు, ఇటు

Published : 08 Nov 2021 20:38 IST

దిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలు లేక ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. అటు నష్టాలు, ఇటు మానసిక ఒత్తిడితో చాలా మంది కుంగిపోయారు. ఈ క్రమంలోనే గతేడాది ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా వ్యాపారుల బలవన్మరణాలు అంతక్రితంతో పోలిస్తే 30శాతం పెరగడం గమనార్హం. ఈ మేరకు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది.

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. 2020లో దేశవ్యాప్తంగా 11,716 మంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 4,356 మంది ట్రేడ్స్‌మెన్‌ కాగా.. 4,226 మంది విక్రేతలు, మిగతా వారు ఇతర వ్యాపార కార్యకలాపాలకు చెందిన వారున్నారు. 2019తో పోలిస్తే వ్యాపార రంగంలో బలవన్మరణాలు గతేడాది 29శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. అంతేగాక, 2020లో రైతుల ఆత్మహత్యల కంటే వ్యాపారుల బలవన్మరణాలే ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. గతేడాది 10,677 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. 

సాధారణంగా ఏటా రైతుల ఆత్మహత్యల కంటే వ్యాపార రంగంలో బలవన్మరణాలు తక్కువగానే ఉండేవి. అయితే గతేడాది కరోనా కారణంగా విధించిన ఆంక్షల నేపథ్యంలో చిన్న వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయి. ఆదాయం లేక అప్పులు పెరిగి అనేక వ్యాపారాలు మూతబడ్డాయి. దీంతో ఆర్థికపరమైన ఒత్తిళ్లతో వ్యాపారులు ప్రాణాలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. 

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో ఆత్మహత్యలు మరింత పెరిగాయి. దేశంలో వివిధ కారణాల వల్ల ప్రాణాలు తీసుకుంటున్న వారిసంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం ఎక్కువగా నమోదైందని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. 2020లో మొత్తం లక్షా 53 మంది పలు కారణాలతో ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని