Bhilwara Incident: స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికల వేలం.. రంగంలోకి మహిళా కమిషన్‌..!

బాలికలను వేలం వేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌ చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాశాం.. ఎన్‌సీడబ్ల్యూ ఛైర్మన్‌

Published : 29 Oct 2022 01:33 IST

జైపుర్‌: రుణాల చెల్లింపుల వివాదాలను పరిష్కరించుకునేందుకు స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు వచ్చిన వార్తలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై భిల్వాఢాకు దర్యాప్తు బృందాన్ని పంపినట్లు కమిషన్ ఛైర్మన్‌ రేఖా శర్మ వెల్లడించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘భిల్వాఢా జిల్లాకు కమిషన్‌ బృందం వెళ్లింది. దీనిపై నవంబర్‌ 1న రాజస్థాన్‌ చీఫ్ సెక్రటరీ, భిల్వాఢా ఎస్పీతో సమావేశం కానున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తరహా ఘటనల గురించి వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పలు వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సెక్రటరీకి లేఖ రాశాం’ అని వెల్లడించారు. మరోపక్క ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా దీనిపై స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది.

ఇదిలా ఉంటే ఈ వార్తలను రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ ఖచారియావాస్‌ ఖండించారు. ‘ఇలాంటి ఘటనల్లో విచారణ పూర్తయ్యేవరకు వాస్తవాలు తెలుసుకోలేం. దీనిపై జాతీయ మహిళా కమిషన్ మొదట రాజస్థాన్‌ పోలీసులతో మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో బాలికల అమ్మకాలు జరగడం లేదు’ అని అన్నారు. ఈ తరహా ఘటనలు కుల పంచాయతీల్లో చోటుచేసుకుంటున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని