Presidential Election: నామినేషన్ వేసిన ద్రౌపదీ ముర్మూ.. వెంటే ఉన్న ప్రధాని, కేంద్రమంత్రులు

రాష్ట్రపతి ఎన్నిక(Presidential election)లో ఎన్డీఏ(NDA) అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్మూ(Droupadi Murmu) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

Updated : 24 Jun 2022 14:04 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక(Presidential election)లో ఎన్డీయే(NDA) అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్మూ(Droupadi Murmu) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం దిల్లీలోని ఒడిశా భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న ఆమె.. తన పత్రాలను సమర్పించారు. ఆమె వెంటే వచ్చిన ప్రధాని మోదీ వాటిని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. దానికి ముందు ఆమె పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌, బిర్సా ముండా విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మూ పేరును మొదట ప్రధాని ప్రతిపాదించగా.. ఆమె పేరును ప్రతిపాదిస్తూ 50 మంది ఎలక్టోరల్ కాలేజ్‌ సభ్యులు సంతకాలు చేశారు. ఎన్డీఏ ఎంపీలు, భాజపా రాష్ట్రాల సీఎంలు, మరో 50 మంది ఎంపీలు ఆమెను బలపరిచారు. వీరిలో వైకాపా తరఫున ఎంపీలు, విజయ్‌సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారు.

ముర్మూ అభ్యర్థిత్వం కోసం భాజపా(BJP) నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రాజనాథ్‌ సింగ్, అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాటిపై సంతకాలు పెట్టారు. ఇక నామినేషన్ సమయంలో వీరితో పాటు భాజపా, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

యశ్వంత్‌ సిన్హాకు ‘జడ్‌’ భద్రత..

విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్రం ‘జడ్’ కేటగిరి భద్రతను కల్పించింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆయనకు రక్షణగా ఉండనున్నారు. ముర్మూకు ఇప్పటికే కేంద్రం జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, సిన్హా ఈ నెల 27 నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా.. జులై 21న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని