Heavy Rains: రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..

ఠానే జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలు భవనాలు వరదనీటిలో చిక్కుకోగా.. రైల్వే ట్రాక్‌లపై మట్టిచేరడంతో లోకల్‌ రైల్‌ సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేశారు.

Updated : 07 Jul 2024 16:16 IST

Heavy Rains| ముంబయి: మహారాష్ట్రలోని ఠానేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఆదివారం ఉదయాన్నే గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఈ వర్షం ధాటికి పలుచోట్ల లోకల్‌ రైళ్లు తాత్కాలికంగా రద్దు కాగా.. కొన్ని భవనాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  ఠానేలోని షాపూర్‌ ప్రాంతంలో ఓ రిసార్టును వరదనీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యటకులను  సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. బోట్‌లు, లైఫ్‌ జాకెట్ల సాయంతో వారిని కాపాడినట్లు తెలిపారు. వర్షాకాలం నేపథ్యలో ముందస్తు సన్నద్ధతలో భాగంగా  ముంబయి, ఠానే, పాల్ఘార్‌ జిల్లాల్లో పలుచోట్ల 13 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించి ఉంచినట్లు పేర్కొన్నారు. 

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

మరోవైపు, భారీ వర్షం నేపథ్యంలో కసర- టిట్వాలా స్టేషన్ల మధ్య పలు లోకల్‌ రైళ్ల సర్వీసుల్ని రద్దు చేసినట్లు సెంట్రల్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం 6.30గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి అట్గావ్‌, థాన్‌సిట్‌ స్టేషన్ల సమీపంలో  రైల్వే ట్రాక్‌పైకి మట్టి చేరడం, వసింద్‌ స్టేసన్‌ సమీపంలో చెట్టు కూలిపోవడంతో నిత్యం రద్దీగా ఉండే కల్యాణ్‌-కసర మార్గంలో  రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఈ నేపథ్యంలో ఆ మార్గంలో లోకల్‌ రైలు సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు సెంట్రల్‌ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని.. వీలైనంత త్వరగా ట్రాక్‌లను క్లియర్‌ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని