Viral Video: ‘మీ సేవలకు థ్యాంక్స్‌’.. తుర్కియేలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందానికి ప్రశంసలు!

తుర్కియే(Turkey) భూకంప (Earthquake)బాధితులకు సేవలందించిన భాతర ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందానికి స్థానికులు ఘనంగా వీడ్కొలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఎన్డీఆర్‌ఎఫ్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Updated : 17 Feb 2023 20:55 IST

ఇస్తాంబుల్‌: తుర్కియే (Turkey)లో భూకంప (Earthquake) బాధితులకు సహాయక చర్యలు అందించి స్వదేశానికి తిరుగుపయనమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందంపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్‌ దోస్త్‌ (Operation Dost)లో భాగంగా అందించిన సేవలకు కృతజ్ఞతగా అదానా సకిర్పాసా ఎయిర్‌పోర్టు (Adana Sakirpasa Airport)లో స్థానికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ప్రవేశ ద్వారానికి ఇరువైపులా నిల్చొని కరతాళ ధ్వనులతో వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఎన్డీఆర్‌ఎఫ్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

భూకంప ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న తుర్కియేకు తక్షణ సహాయచర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం (Indian Government) ఆపరేషన్‌ దోస్త్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా భారత ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు, వైద్య సిబ్బందిని ఆ దేశానికి పంపిన సంగతి తెలిసిందే. 51 మంది సిబ్బంది, రెండు డాగ్‌ స్వాడ్‌లతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పది రోజులపాటు తుర్కియేలో సహాయచర్యల్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో ఎంతో మందిని భారత ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిథిలాల కింద నుంచి వెలికితీశాయి. 

శిథిలాల కింద చిక్కుకున్న బెరెన్‌ అనే ఆరేళ్ల బాలికను భారత ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందంలోని జాగిలాలు రోమియా, జూలీ గుర్తించాయి. మెషీన్లు బాలికను గుర్తించలేకపోయినప్పటికీ.. జాగిలాలు బాలికను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయి. గురువారం భారత్‌కు తిరుగుపయనమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడి స్థానికులు వీడ్కోలు పలుకుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సేవలను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు తుర్కియేలో సుమారు 36 వేల మంది, సిరియాలో మూడువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు