India Vaccination: జూన్‌లో 12కోట్ల డోసులు..!

జూన్‌ నెలలోనే 12కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 30 May 2021 16:23 IST

వీటిలో 6 కోట్ల డోసులు ఉచితం - కేంద్రం వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది. కేవలం జూన్‌ నెలలోనే 12కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రస్తుత మే నెలలో 7.9కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండగా.. జూన్‌లో ఈ సంఖ్య 12కోట్లకు పెరగనుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

45ఏళ్ల వయసుపైబడిన వారితో పాటు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ అందించడంలో భాగంగా జూన్‌ నెలలో 6.09కోట్ల డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగానే సరఫరా చేస్తాం. వీటికి అదనంగా.. మరో 5.86కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు సేకరించుకునేందుకు అందుబాటులో ఉంటాయి. దీంతో దేశవ్యాప్తంగా జూన్‌ మొత్తంలో దాదాపు 12కోట్ల (11,95,70,000) డోసులు అందుబాటులో ఉంటాయి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిని సరఫరా చేసే సమయాన్ని ఆయా రాష్ట్రాలకు తెలియజేస్తామని పేర్కొంది.

‘దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన జూన్‌ నెలలో అందుబాటులో ఉండే డోసుల సమాచారాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ముందుగానే తెలియజేస్తున్నాం. తద్వారా వ్యాక్సిన్‌ సేకరణ, పంపిణీకి ఆయా రాష్ట్రాలు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది’ అని అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్‌ పంపిణీ, జనాభా, డోసుల వృథాను పరిగణలోకి తీసుకొని ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేస్తున్నామని తెలిపింది. ’అందుచేత వ్యాక్సిన్‌ను హేతుబద్ధంగా వినియోగించడంతోపాటు వ్యాక్సిన్‌ వృథాను అరికట్టేవిధంగా ఆయా రాష్ట్రాలు అధికారులకు సూచించాలని కేంద్రం విజ్ఞప్తిచేసింది.

ఇక మే నెలలో ఆయా రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు దాదాపు 3.9కోట్ల డోసులను సమీకరించుకోగా.. కేంద్ర ప్రభుత్వం 4.03కోట్ల డోసులను రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేసింది. దీంతో మే నెలలో దాదాపు 7.9కోట్ల డోసులను పంపిణీ చేస్తుండగా.. జూన్‌ నెలలో ఈ సంఖ్య 12కోట్లకు పెరగనుంది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21కోట్ల 20లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని