జనవరి 1, 2021..60వేల జననాలు!

2021 మొదటి రోజున భారత్‌లో రికార్డు స్థాయి జననాలు నమోదుకానున్నాయని ఐరాస అనుబంధ సంస్థ యునిసెఫ్ అంచనావేసింది.

Published : 02 Jan 2021 00:48 IST

గతేడాది పోల్చితే తగ్గుదల 

దిల్లీ: 2021 సంవత్సరం మొదటి రోజున భారత్‌లో రికార్డు స్థాయి జననాలు నమోదుకానున్నాయని ఐరాస అనుబంధ సంస్థ యునిసెఫ్ అంచనా వేసింది. సుమారు 60 వేల జననాలతో మనదేశం మొదటి స్థానంలో నిలవనుందని తెలిపింది. జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న చైనాలో మాత్రం 35,615 మంది మాత్రమే ఈ భూమ్మీదకు అడుగుపెట్టనున్నారని వెల్లడించింది. మన దేశంతో పోల్చితే ఆ సంఖ్య దాదాపు సగమే.

కాగా, కొత్త సంవత్సరం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 3,71,504 శిశువులు జన్మిస్తారని యునిసెఫ్ లెక్కలు కట్టింది. ఈ ఒక్కరోజు 52 శాతం జననాలు 10 దేశాల్లోనే చోటుచేసుకుంటాయని తెలిపింది. అలాగే మొత్తంగా ఈ ఏడాది 140 మిలియన్ల మంది జన్మించనున్నారని వెల్లడించింది. ఇదిలా ఉండగా..ఇప్పటివరకు కరోనాతో సంభవించిన మరణాలకు..ఈ ఏడాది జననాలు 78 రెట్లుగా ఉంటాయని వెల్లడించడం గమనార్హం. మరోవైపు, భారత్‌లో 2020 ప్రారంభ రోజుతో పోల్చుకుంటే ఈసారి జననాల్లో తగ్గుదల కనిపించవచ్చని, సుమారు 7,390 తక్కువ జననాలు సంభవిస్తాయని పేర్కొంది.

భారత్‌లో 2021లో జన్మించే వారి సగటు జీవిత కాలం 80.9 సంవత్సరాలుగా ఉంటుందని ఈ ఐరాస విభాగం అభ్రిపాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది 84 సంవత్సరాలుగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచంతో పోల్చితే భారత్‌లో సగటు జీవిత కాలం మూడు సంవత్సరాలు తక్కువగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవజాత సంరక్షణ కేంద్రాలు చంటిబిడ్డల ఆయువు నిలపడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కేంద్రాల కారణంగా 2014, 2020 మధ్య ప్రత్యేక అవసరాలతో జన్మించిన సుమారు పదిలక్షల మంది నవజాత శిశువులు మనుగడ సాగిస్తున్నారని సంస్థ తెలిపింది. కాగా, ఈ ఏడాదితో యునిసెఫ్‌ 75వ వసంతంలోకి అడుగుపెట్టనుంది.

ఇవీ చదవండి:

కొత్త ఏడాదిలో కలికట్టుగా ముందుకు..

కొవిడ్‌ టీకా: ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని