Punjab: గవర్నర్‌ Vs గవర్నమెంట్‌.. సుప్రీం చురకలు

పంజాబ్‌లో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ అంశంలో ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీం కోర్టు చురకలంటించింది. ఎవరి బాధ్యతలను వారు విస్మరించకూడదని మందలించింది.

Published : 28 Feb 2023 23:32 IST

దిల్లీ: పంజాబ్‌ ప్రభుత్వం, గవర్నర్‌ వ్యవస్థల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన రాజ్యాంగంపై చర్చ జరగాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ రాజ్యాంగం కల్పించిన అధికారాలను నిర్వర్తించడంలో ఒకరు విఫలమైతే.. రాజ్యాంగం ప్రకారం తన కర్తవ్యాలను నిర్వర్తించడం మరొకరికి సాధ్యపడదు’’ అంటూ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇరు పక్షాలకు చురకలంటించింది. వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న సుప్రీం కోర్టు.. గవర్నర్‌ మాత్రం ఏ పార్టీకీ చెందిన వారు కాదని చెప్పింది. కానీ, దీనిపై రాజ్యాంగ పరమైన చర్చ జరగాల్సిన అవసరముందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.

మార్చి 2  నుంచి రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు అనుమతివ్వాలంటూ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌,  గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌కు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ కార్యాలయం.. అంతకుముందు రాజ్‌భవన్‌ రాసిన లేఖపై ముఖ్యమంత్రి స్పందనను ఉటంకించింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరిగా లేవని పేర్కొంటూ, న్యాయపరమైన సమీక్ష చేసిన తర్వాతే బడ్జెట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటామని రిప్లై ఇచ్చింది. దీంతో బడ్జెట్‌ నిర్వహణ తేదీ దగ్గర పడుతున్నా, సమావేశాలకు ఆమోదం తెలపకుండా తాత్సారం చేస్తున్నారని పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఇరువర్గాలను మందలించింది.
‘‘ గవర్నర్‌ లేఖపై ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో స్పందించడం సరికాదు. తాను చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్‌కు సమాచారం ఇవ్వక పోవడం రాజ్యాంగ విధులకు విరుద్ధం. అలాగే, బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి అనుమతి కోరగా.. గవర్నర్‌ తాత్సారం చెయ్యడం కూడా రాజ్యాంగం తనకు అప్పగించిన బాధ్యతలను విస్మరించినట్లే అవుతుంది.’’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగింది?

ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్‌ ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఏ ప్రాతిపదికన పాఠశాలల ప్రిన్సిపాళ్లను సింగపూర్ పర్యటనకు ఎంపిక చేశారంటూ తనకు ఫిర్యాదులు అందాయని, వారి రవాణా, శిక్షణ, వసతి సదుపాయాల కోసం ఎంత ఖర్చయిందంటూ అందులో ప్రశ్నించారు. పంజాబ్‌ ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం అయ్యారంటూ గతంలో రాసిన లేఖతో ఏకీభవిస్తున్నానని చెప్పిన గవర్నర్‌.. రాజ్యాంగం ప్రకారం పాలన సాగించేందుకు వీలుగా పంజాబ్‌ ప్రజలతోపాటు గవర్నర్‌ కూడా సీఎంగా మాన్‌ను బాధ్యతలు చేపట్టాలంటూ చేసిన పిలుపును మర్చిపోవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన భగవంత్‌ మాన్‌.. మూడుకోట్ల మంది పంజాబ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని, అంతేగానీ, కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్‌కు కాదంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారికంగా లేఖ కూడా రాశారు. ఏ ప్రాతిపదికన సింగపూర్‌ పర్యటనకు ప్రిన్సిపాళ్లను ఎంపిక చేశారని అడగడం బాగానే ఉందన్న సీఎం.. ఏ ప్రాతిపదికన వివిధ రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్‌లను నియమిస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసిన ట్వీట్‌, రాసిన లేఖ రెండు రాజ్యాంగ విరుద్ధంగానే ఉన్నాయన్న గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌.. న్యాయ సలహా తీసుకున్న తర్వాతనే బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఈ వివాదంపైనే తాజాగా సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని