Modi: రండి.. కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం: జి-20 వేదికగా మోదీ పిలుపు

ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు.

Published : 15 Nov 2022 10:57 IST

బాలి: రష్యా దండయాత్రతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు యావత్‌ ప్రపంచం సమష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జి-20 వేదికగా పిలుపునిచ్చారు. కొవిడ్‌ మహమ్మారి తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరిపైనా ఉందని ప్రపంచ దేశాధినేతలకు చాటిచెప్పారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాల గురించి ఆయన ప్రస్తావించారు.

ఇప్పుడు మనవంతు వచ్చింది..

‘‘ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ, దౌత్య మార్గాన్ని తిరిగి తీసుకురావడానికి మనమంతా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం.. ప్రపంచంలో పెను విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత శాంతిని నెలకొల్పేందుకు అప్పటి ప్రపంచ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మనవంతు వచ్చింది. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులు.. ఇప్పుడు ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల ప్రపంచ సరఫరా గొలుసులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందుకే మనమంతా ఏకమవ్వాలి. కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనందరి భుజాలపై ఉంది. ప్రపంచంలో శాంతి, సామరస్యం, భద్రతను పటిష్టం చేసేందుకు సమష్టి సంకల్పంతో ముందుకెళ్లడం చాలా ముఖ్యం. బుద్ధుడు, గాంధీ మహాత్ముడు నడయాడిన నేలలో వచ్చే ఏడాది జి-20 సదస్సు జరగనుంది. ఆ వేదికగా ప్రపంచ శాంతికి బలమైన సందేశం ఇస్తామని భారత్‌ విశ్వాసంగా ఉంది’’ అని మోదీ నొక్కిచెప్పారు.

ఇంధన సరఫరాపై ఆంక్షలు వద్దు..

ఈ సందర్భంగా రష్యా చమురు, గ్యాస్‌ కొనుగోళ్లపై పశ్చిమ దేశాల ఆంక్షల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ‘‘భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అందువల్ల ప్రపంచ వృద్ధికి భారత ఇంధన భద్రత కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులను మనం ప్రోత్సహించకూడదు. ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఇక, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనానికి భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘2030 నాటికి మా విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అవుతుంది. పునరుత్పాదక వనరుల ఇంధన ఉత్పత్తి కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన సాంకేతికను అందించడం, ఆర్థికంగా అండగా ఉండటం ముఖ్యం’’ అని మోదీ తెలిపారు.

నేడు ప్రపంచంలో చాలా చోట్ల ఆహార, ఆర్థిక సంక్షోభాలు ఏర్పడ్డాయని, దీని వల్ల ఎంతో మంది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మోదీ అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా విఫలమవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అలాంటి వారికి అండగా నిలబడేందుకు ఈ జి-20 వేదికగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు.

ఈ సదస్సు ముగింపు వేడుకల్లో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్‌కు జి-20 అధ్యక్ష పగ్గాలను అప్పగించనున్నారు. వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న ఆ కూటమి సదస్సుకు హాజరవ్వాల్సిందిగా సభ్యదేశాల నేతలను మోదీ వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని