IAF chief: మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే..!

ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీవ్రమైన, స్వల్పకాలం ఆపరేషన్లకు భారత వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపది వీఆర్‌ చౌదరీ ఉద్ఘాటించారు.

Updated : 28 Apr 2022 14:57 IST

ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరీ

దిల్లీ: ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ పేర్కొన్నారు. ముఖ్యంగా ‘స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు’ సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న ఎయిర్‌ మార్షల్‌.. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఉదహరించారు. ఓ సెమినార్‌లో ప్రసంగించిన వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ.. ఇటీవలి కాలంలో వాయుసేనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మారుతున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పూర్తి కార్యాచరణతో ప్రతిస్పందించాలని అన్నారు.

‘ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వల్ప వ్యవధిలో జరిగే శక్తివంతమైన తేలికపాటి ఆపరేషన్లకు భారత వాయుసేన సన్నద్ధంగా ఉంది. ఇటువంటి అధిక తీవ్రత కలిగిన సరికొత్త ఆపరేషన్లను కొనసాగించేందుకు వ్యూహరచనల్లో భారీ మార్పులు అవసరం’ అని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ స్పష్టం చేశారు. ఇక ఉత్తర సరిహద్దుల వెంట దేశ భద్రతా సవాళ్లపై ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తూర్పు లద్దాఖ్‌ను ఉదహరిస్తూ. ఏవైనా ఆకస్మిక పరిస్థితులు ఎదురైనప్పుడు మానవ వనరులు, సామగ్రిని వేగంగా తరలించే మార్గాలను రూపొందించుకోవాలన్నారు.

భారత్‌ ఆత్మనిర్భరతను సాధించడంలో భాగంగా కీలకమైన పరికరాలను స్వదేశంలోనే అభివృద్ధి చేసుకునే కార్యాచరణ ప్రణాళికపైనా దృష్టి సారించాలని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ చౌదరీ సూచించారు. ఇదిలాఉంటే, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు ఏమిటన్నవి ప్రస్తావించనప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం, వాటి పర్యవసానాలను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభననూ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఉదహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని