Coal crisis: అందుకే బొగ్గు అవసరం పెరిగిపోతోంది.. 2040 నాటికి రెట్టింపు: కేంద్రమంత్రి

దేశంలో నానాటికీ పెరుగుతున్న ఇంధనం డిమాండ్‌ను తీర్చేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వీలుగా దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాల్సిన .......

Published : 06 May 2022 18:08 IST

ముంబయి: దేశంలో నానాటికీ పెరుగుతున్న ఇంధనం డిమాండ్‌ను తీర్చేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వీలుగా దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగడం, విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా 2040 నాటికి బొగ్గు అవసరం రెట్టింపు కానుందన్నారు. ఇంధన అవసరాలు పెరగడానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాల్సి ఉందన్నారు. థర్మల్‌ బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడం, ఈ రంగంలో ఆత్మనిర్భరతను సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి జోషీ మాట్లాడారు. ‘‘గతంలో చాలా మంది బొగ్గు అవసరం తగ్గుతుందని చెప్పేవారు. కానీ, ఇప్పుడు వాటి అవసరాలు పెరగడం చూస్తున్నాం. మూతబడిన బొగ్గు గనుల్లో దాదాపు 380 మిలియన్‌ టన్నులు సేకరించదగిన నిల్వలు ఉన్నాయి. వాటి నుంచి 30-40 మిలియన్‌ టన్నుల బొగ్గును సులభంగా తీయొచ్చు. మైనింగ్‌ కార్యకలాపాలను నిరంతరం కొనసాగించడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు బొగ్గు సరఫరా కూడా పెరిగేందుకు దోహదం చేస్తుంది. పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించినప్పటికీ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోంది’’ అన్నారు.

‘‘అందువల్లే కోల్‌ ఇండియా లిమిటెడ్‌  (CIL) తన 20 మూసివేసిన/రద్దు చేసిన భూగర్భ బొగ్గు గనుల్ని తిరిగి తెరిచేందుకు సిద్ధమవుతోంది. రెవెన్యూ షేరింగ్‌ మోడల్‌లో ఈ గనుల్ని ప్రైవేటు రంగానికి అందించి తిరిగి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు యోచిస్తోంది. 2014లో 570 మిలియన్‌ టన్నులుగా ఉన్న బొగ్గు అవసరాలు 2022 మార్చి నాటికి 818 మిలియన్‌ టన్నులకు పెరిగింది. అంటే దాదాపు 43శాతం పెరిగింది. ఇది మున్ముందు మరింతగా పెరిగి 2040నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వాణిజ్య గనుల తవ్వకం భారత ఆర్థిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను నెరవేర్చడంలో సహాయపడుతుంది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలో 1.2 బిలియన్‌ మెట్రిక్‌ టన్నులుకు దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడమే కేంద్రం లక్ష్యమని బొగ్గుశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ జైన్‌ అన్నారు. పెట్టుబడిదారులకు ఇది సువర్ణావకాశమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని