Published : 03 Mar 2021 11:33 IST

నీరా టాండన్ నియామకంపై  బైడెన్‌ వెనక్కి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో బడ్జెట్‌ చీఫ్‌గా భారత అమెరికన్‌ నీరా టాండన్‌ నియామకంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెనక్కి తగ్గారు. నీరా నియామకంపై సెనెట్‌తో పాటు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్‌కు ఇది తొలి కేబినెట్‌ వైఫల్యంగా మారింది. 

భారత మూలాలున్న నీరా టాండన్‌ను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా బైడెన్‌ నిర్ణయించారు. అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్‌ నేతలతో సహా పలువురు చట్టసభ్యులను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఇవి కాస్తా వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమె నియామకాన్ని కేబినెట్‌ మంత్రులు, డెమొక్రాటిక్‌ చట్టసభ్యులు వ్యతిరేకించారు. ఆమె నియామకాన్ని ధ్రువీకరించేందుకు సెనెట్‌లో సరిపడా ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో నీరా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు బైడెన్‌కు లేఖ రాశారు.‘‘నా నియామకాన్ని ధ్రువీకరించేందుకు శ్వేతసౌధంలో మీరు, మీ బృందం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కానీ, దురదృష్టవశాత్తు అది సాధ్యపడేలా కన్పించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నామినేషన్‌ను కొనసాగించలేదు. అందుకే నా పేరును విత్‌ డ్రా చేసుకోవాలని కోరుతున్నా’’ అని నీరా లేఖలో పేర్కొన్నారు. 

‘‘బడ్జెట్‌ డైరెక్టర్‌ పదవికి తన నామినేషన్‌ను విత్‌ డ్రా చేయాలని నీరా చేసిన అభ్యర్థనను నేను అంగీకరించాను’’ అని బైడెన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఆమె సాధించిన విజయాపై తనకు చాలా గౌరవం ఉందని, త్వరలోనే ఆమెను పాలనావర్గంలో మరో పదవిలోకి తీసుకొనే అవకాశాలన్ని పరిశీలిస్తున్నామని బైడెన్‌ వెల్లడించారు. నీరా గతంలో పలువురు రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ సెనెటర్లను విమర్శిస్తూ పలు ట్వీట్లు చేశారు. అయితే తన నామినేషన్‌ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఆమె దాదాపు 1000కి పైగా ట్వీట్లను తొలగించారు. సెనెటర్లకు క్షమాపణలు కూడా తెలిపారు. కానీ, ఆమెకు ఊరట లభించలేదు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని