NEET Exam 2024: నీట్‌ పేపర్‌ లీక్‌లో బిహార్‌ ముఠా

దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు వార్తలొచ్చాయి. వీటిని కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) తోసిపుచ్చింది.

Published : 16 Jun 2024 06:27 IST

ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు వసూలు
ప్రభుత్వ జూనియర్‌ ఇంజినీర్‌కూ భాగస్వామ్యం

పట్నా: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు వార్తలొచ్చాయి. వీటిని కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) తోసిపుచ్చింది. అయితే, తాజాగా బిహార్‌ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌ పేపర్‌ను లీక్‌ చేసిన ముఠా.. రూ.30 లక్షల చొప్పున చాలామందికి అమ్మినట్లు బయటపడింది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నాడు. ‘‘మే 4వ తేదీన మాకు నీట్‌ ప్రశ్నపత్రం లభించింది. ఈ పేపర్‌ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి రూ.30లక్షల నుంచి రూ.32 లక్షల చొప్పున తీసుకున్నాం. ఆ తర్వాత వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నపత్రం చూపించాం’’ అని మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 13 మంది నీట్‌ అభ్యర్థులు ఈ పేపర్‌ లీక్‌లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని