నీట్‌- పీజీ పరీక్ష తేదీ ఖరారు 

కరోనా సెకండ్ వేవ్‌ ఉద్దృతి కారణంగా వాయిదా పడిన నీట్‌ - పీజీ పరీక్షకు కేంద్రం కొత్త తేదీని ప్రకటించింది. సెప్టెంబర్......

Published : 13 Jul 2021 19:25 IST

దిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌ ఉద్దృతి కారణంగా వాయిదా పడిన నీట్‌ - పీజీ పరీక్షకు కేంద్రం కొత్త తేదీని ప్రకటించింది. సెప్టెంబర్‌ 11న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పరీక్షకు ఏర్పాట్లు చేయనున్నారు. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు నెలాఖరు వరకు ఈ పరీక్ష నిర్వహించబోమని గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే.  ‘‘నీట్‌ పీజీ పరీక్షను సెప్టెంబర్‌ 11న నిర్వహించాలని నిర్ణయించాం. విద్యార్థులకు నా శుభాకాంక్షలు’’ అని మాండవీయ ట్వీట్‌ చేశారు. 

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి నేపథ్యంలో నీట్‌ పీజీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్‌ఈబీ) సిద్ధమవ్వడంతో పెద్ద ఎత్తున వైద్యులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. యువ వైద్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్‌ 18న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ ప్రకటించారు. ఆ తర్వాత మే నెలలో పీఎంవో కూడా దీనిపై స్పందించింది. ఈ పరీక్షను ఆగస్టు చివరి వరకు నిర్వహించబోమని స్పష్టంచేసింది. విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు నెల రోజులు సమయం ఉండేలా ఈ పరీక్షకు కొత్త తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. మరోవైపు, సెప్టెంబర్‌ 12న నీట్‌ పరీక్ష నిర్వహించాలని నిన్న ఎన్‌టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ ఈ సాయంత్రం నుంచి ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని