NEET-PG: నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు ‘సుప్రీం’ బ్రేక్‌.. కేంద్రానికి ఆదేశాలు

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు బ్రేక్‌ వేసింది. నీట్‌లో రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునేవరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని

Updated : 25 Oct 2021 16:42 IST

దిల్లీ: నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు బ్రేక్‌ వేసింది. నీట్‌లో రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్లపై నిర్ణయం తేలకుండా కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తే విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. 

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్‌ పీజీ ఆల్‌ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది జులై 29న మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నోటిషికేషన్‌ జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది నీట్‌ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పీజీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా నీట్‌ పీజీలో రిజర్వేషన్లు కేటాయించారని, దీనివల్ల జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి మైనార్టీలుగా మిగిలిపోతారని పిటిషనర్లు ఆరోపించారు. ఇది ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని పేర్కొన్నారు.

దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. అక్టోబరు 25 నుంచి నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో పిటిషనర్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. రిజర్వేషన్ల చెల్లుబాటుపై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. లేదంటే విద్యార్థులు నష్టపోతారని పేర్కొంది. కోర్టు తీర్పు వచ్చే వరకు కౌన్సెలింగ్‌ చేపట్టబోమని కేంద్రం కూడా హామీ ఇచ్చింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని