
NEET PG counselling: జనవరి 12 నుంచి నీట్-పీజీ కౌన్సిలింగ్!
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి
దిల్లీ: గతకొన్ని రోజులుగా నీట్-పీజీ కౌన్సిలింగ్‌పై ఏర్పడ్డ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. జనవరి 12 నుంచి నీట్-పీజీ కౌన్సిలింగ్ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. కొవిడ్‌పై పోరాడుతున్న సమయంలో దేశానికి ఇదెంతో బలాన్నిస్తుందన్న ఆయన.. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 2021-22 ఏడాదికి నీట్-పీజీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధమైంది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారుల్ని గుర్తించేందుకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి కూడా ఓకే చెప్పింది. దీనికి సంబంధించి మార్చి మూడో వారంలో విచారణ జరుపుతామని, ఆ సమయంలో ఈడబ్ల్యూఎస్ చెల్లుబాటును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అలాగే నీట్ కౌన్సిలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి నీట్-పీజీ కౌన్సిలింగ్ చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.