NEET PG: నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా..

నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా.. 6-8 వారాల

Updated : 04 Feb 2022 12:18 IST

దిల్లీ: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్‌ పీజీ ప్రవేశ 2022’ పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా.. 6-8 వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌కు తెలిపింది. నీట్‌ పీజీ 2021 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తదుపరి తేదీని వెల్లడించే అవకాశముంది.

ఇదిలా ఉండగా.. నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆరుగురు ఎంబీబీఎస్‌ డాక్టర్లు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది చాలా మంది ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్స్‌ తమ ఇంటర్నెషిప్‌ను ఇంకా పూర్తిచేయలని, అందువల్ల పరీక్షను మరో తేదీలో నిర్వహించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. నీట్‌ పీజీ పరీక్ష రాసే వైద్యులు తప్పనిసరిగా ఇంటర్నెషిప్‌ను పూర్తిచేయాలి. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో తప్పనిసరిగా విధులకు హాజరవ్వాల్సి వచ్చినందున చాలా మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లు తమ ఇంటర్నెషిప్‌ను పూర్తిచేయలేకపోయారని పిటిషనర్లు పేర్కొన్నారు. వీరి పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

ఈ నేపథ్యంలోనే నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ‘‘ప్రస్తుతం నీట్‌ పీజీ 2021 కౌన్సెలింగ్‌ జరుగుతున్నందున నీట్‌ పీజీ 2022 పరీక్షను వాయిదా వేయాలని చాలా మంది ఎంబీబీఎస్‌ వైద్యుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. అంతేగాక, ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తే మే-జూన్‌లో జరిగే పీజీ 2022 కౌన్సెలింగ్‌కు ఇంటర్న్‌షిప్‌లోని వైద్యులు హాజరుకాలేరు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీట్‌ పీజీ 2022 పరీక్షను 6-8 వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది’’ అని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌కు ఆరోగ్య శాఖ సమాచారమిచ్చింది. అయితే తదుపరి తేదీలను ఇప్పుడే వెల్లడించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని