NEET row: ‘నీట్‌’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్‌

నీట్‌(NEET) వివాదంపై సీబీఐతో కాకుండా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ డిమాండు చేశారు.

Published : 16 Jun 2024 15:12 IST

దిల్లీ: నీట్‌(NEET)లో అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ డిమాండు చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. పీటీఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ప్రధానమంత్రి మౌనంగా ఉండటం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది చర్చకు రాకపోవచ్చని, కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ప్రభుత్వం దీనిని అనుమతించకపోవచ్చన్నారు.

నీట్‌ పేపర్‌ లీక్‌లో బిహార్‌ ముఠా

‘‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విధానంలో అవినీతి జరిగిందంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. గుజరాత్‌లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు ఎంతో కలవరపరిచాయి. జాతీయస్థాయిలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాలపై మాట్లాడుతున్న కొందరు.. గత యూపీఏ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (MCI) ఆధ్వర్యంలోని డైరెక్టర్లు 2010లోనే నీట్‌ (NEET) నిబంధనలు రూపొందించారు. ఎంసీఐ అనేది ఆరోగ్యశాఖ పరిధిలోకి రాదు.. విద్యాశాఖ కిందకు వస్తుంది. అందుకే హెచ్‌ఆర్‌డీ మంత్రిగా నాకు దాంతో సంబంధం లేదు’’ అని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు.

సీబీఐతో కాకుండా..

భాజపా హయాంలో.. 2019లో ఐఎంసీఏ 1956 స్థానంలో ఎన్‌ఎంసీఏ చట్టాన్ని ఆమోదించారని, అందులోని సెక్షన్‌ 14లో నీట్‌ ప్రస్తావన ఉందన్నారు. అక్టోబర్‌ 29, 2020లో సుప్రీం కోర్టు కూడా ఈ చట్టాన్ని సమర్థించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. గత యూపీఏ ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదన్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే అధికారులను కాపాడే అవకాశాలు ఉన్నాయని, అందుకే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే స్వతంత్ర దర్యాప్తు బృందం లేదా ప్రభుత్వంతో సంబంధం లేని నిపుణులతో దర్యాప్తు జరిపించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని