Congress: నీట్‌ వ్యవహారం.. ‘వ్యాపమ్‌ 2.0’..! కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు

‘నీట్‌- యూజీ 2024’ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది.

Published : 14 Jun 2024 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ 2024 (NEET)’పై పెద్దఎత్తున వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా దీనిపై కాంగ్రెస్‌ (Congress) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్ విచారణే.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుందని ఉద్ఘాటించింది.   కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)ల ద్వారా మోదీ ప్రభుత్వం నీట్‌ కుంభకోణాన్ని కప్పిపుచ్చడం ప్రారంభించిందని హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

‘‘నీట్‌ పేపర్‌ లీక్‌ కానప్పుడు.. బిహార్‌లో పేపర్‌ లీక్‌ పేరిట 13 మందిని ఎందుకు అరెస్టు చేశారు? గుజరాత్‌లోని గోధ్రాలో చీటింగ్ రాకెట్‌ గుట్టురట్టు కాలేదా? మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందా? దాదాపు 24 లక్షల మంది యువత ఆకాంక్షలను తుంగలో తొక్కింది. ఎన్‌టీఏను దుర్వినియోగం చేసింది. మార్కులు, ర్యాంకులను భారీగా రిగ్గింగ్ చేసింది. దీంతో రిజర్వ్‌డ్ సీట్లకు కటాఫ్‌ కూడా పెరిగింది. మెరిట్‌ విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందకుండా చేసేందుకే కేంద్రం ఈ ఆటలాడినట్లు కనిపిస్తోంది’’ అని ఖర్గే ఆరోపించారు. మోదీ పాలనలో ‘నీట్‌’ కూడా చీట్‌ (సెంట్రల్‌ హైప్డ్‌ ఎంట్రెన్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)లా కనిపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు.

‘కోటా ఆత్మహత్యలను ప్రస్తావించొద్దు’.. నీట్‌ పిటిషన్లపై సుప్రీం

నీట్‌ వ్యవహారం.. ‘వ్యాపమ్‌ 2.0’ అని పార్టీ మీడియా ఇన్‌ఛార్జి పవన్‌ ఖేడా విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో నిరసనలు, కోర్టు కేసులు, విద్యార్థుల ఆగ్రహాన్ని ప్రేరేపిత చర్యలుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారని ఆరోపిస్తూ.. ఇది 24 లక్షల మంది ఆశావహుల పుండుపై కారం చల్లినట్లే ఉందని, వారి భవిష్యత్తును భాజపా నాశనం చేస్తోందని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. 2013లో మధ్యప్రదేశ్‌ను వ్యాపమ్‌ కుంభకోణం కుదిపేసింది. ఉద్యోగ నియామకాల్లో బయటపడిన మోసాలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని