NEET UG 2024: ప్రశ్నపత్రం లీక్‌ నిజం...విస్తృతి ఎంతో తేలాలి

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌-యూజీ(2024) పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది.

Published : 09 Jul 2024 03:50 IST

అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి
ఈ సమాచారం ఆధారంగానే మళ్లీ పరీక్షపై నిర్ణయం
నీట్‌-యూజీ వివాదంపై సుప్రీంకోర్టు 

దిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌-యూజీ(2024) పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రతకు భంగం కలిగిందనడంలో ఎలాంటి సందేహమూ లేదని పేర్కొంది. అయితే, ఇది 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అయినందున ‘మళ్లీ పరీక్ష’ నిర్వహణకు ఆదేశించడాన్ని తాము చివరి ఆప్షన్‌గానే భావిస్తామని వెల్లడించింది. పరీక్షాపత్రం లీకేజీ విస్తృతి ఎంత, అక్రమార్కులు అందుకు అనుసరించిన విధానం ఏమిటి, లబ్ధిపొందిన విద్యార్థులు ఎందరు, సాధారణ విద్యార్థుల నుంచి అక్రమ లబ్ధిదారులను గుర్తించడం సాధ్యమేనా, లీకేజీకి-పరీక్ష నిర్వహణకు ఉన్న వ్యవధి ఎంత తదితర ప్రశ్నలన్నింటిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

సమగ్ర నివేదికకు ఆదేశం

  నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘‘నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న విషయం స్పష్టమైంది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారనడంలో సందేహంలేదు. నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా, లీకైన ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం’’ అని తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.

విచారణ సందర్భంగా కేంద్రానికి ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ప్రశ్నపత్రం లీకేజీతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు.. కానీ, అది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం. అందువల్ల, లీక్‌ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి. ప్రశ్నపత్రం ఎంత మందికి చేరిందో గుర్తించారా? ఎలా చేరిందో తెలుసుకున్నారా? ఎంత మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ప్రశ్నపత్రం ఎన్ని నగరాల్లోని కేంద్రాల్లో లీకైంది, ఎంత మంది లబ్ధిదారులను గుర్తించారో నివేదించాలని ఎన్‌టీఏకి స్పష్టం చేసింది. సమగ్ర పరిశీలన తర్వాత తీర్పు వెలువరిస్తామంది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా నిరోధించడంపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నీట్‌-యూజీ(2024)లో 100శాతం మార్కులు 67 మందికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ మందికి గరిష్ఠ మార్కులు రాలేదని గుర్తు చేసింది. నీట్‌-యూజీని రద్దు చేయవద్దని కోరుతూ 50 మంది గుజరాత్‌ విద్యార్థులు విడిగా దాఖలు చేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణ జరుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని