NEET UG 2024: నీట్‌-యూజీ ప్రవేశాలను నిలిపివేయం

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ (2024) పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 12 Jun 2024 06:13 IST

పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు
ప్రవేశ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని వ్యాఖ్య

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ (2024) పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ)పై ఉందని తెలిపింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతరత్రా అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఎన్‌టీఏలను ఆదేశించింది. అయితే, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలుపుదల (స్టే) చేసేందుకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసు జారీ చేసింది. ఆ రాష్ట్రం పరిధిలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కోర్టుకు వేసవి సెలవులు ముగిసిన అనంతరం జులై 8వ తేదీ నుంచి ఈ కేసుపై రెగ్యులర్‌ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఆలోగా ఎన్‌టీఏ సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. నీట్‌-యూజీ(2024) నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివంగి మిశ్ర, మరో 9 మంది నీట్‌ అభ్యర్థుల పిటిషన్లను కూడా ఈ కేసుతో జత చేసింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగే కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలన్న విద్యార్థుల తరఫు న్యాయవాది అభ్యర్థననను ధర్మాసనం తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌ను కొనసాగనివ్వాలని సెలవుకాల ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కూడా మే 17న నీట్‌-యూజీ(2024) ఫలితాల వెల్లడిపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనపై నోటీసు జారీ చేసేందుకు అంగీకరించింది. ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్‌ యూజీ-2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

నీట్‌-పీజీ 2022పై పిటిషన్‌ కొట్టివేత

పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను 2022లో నిర్వహించిన నీట్‌-పీజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని