Congress: నీట్‌ వివాదం..జూన్ 21న దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్‌ పిలుపు

నీట్‌లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్‌ జూన్‌ 21న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Updated : 19 Jun 2024 19:20 IST

దిల్లీ: నీట్‌(NEET UG) పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థిసంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 21న యోగా డే రోజున నీట్‌లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. జూన్ 21న దేశవ్యాప్తంగా అన్ని పార్టీ యూనిట్లలో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) బుధవారం కోరారు. నీట్‌ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి బిహార్, గుజరాత్, హరియాణాల్లో జరిగిన అరెస్టులే నిదర్శనమని ఆయన అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో వ్యవస్థీకృత అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షల్లో జరిగే ఇటువంటి అక్రమాలు పరీక్ష ప్రక్రియల విశ్వసనీయతను దెబ్బ తీస్తాయన్నారు. దీని వల్ల ఎందరో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలు చేస్తామని, యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే విద్యార్థులకు న్యాయం అందేలా చేయడం కోసం తాము దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తున్నామని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్‌-యూజీ(NEET-UG). ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో పాటు నీట్‌ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు